నిలిచి ఉన్న లారీలు, భారీ వాహనాలతో నెత్తురోడుతున్న రోడ్లు 7 నెలల్లో 80 మంది మృతి న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేరవిభాగం చంద్రయాన్‌పల్లి వద్ద డివైడర్‌ పైకి దూసుకెళ్లిన డీసీఎం జిల్లాలోని జాతీయ రహదారులపై ఆగి ఉన్న, అతివేగంతో నియంత్రణ కోల్పోయే లారీలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. భారీ వాహనం, క్యాబిన్‌ కారణంగా చాలా సందర్భాల్లో డ్రైవర్లు ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నా, ఇతర కారు, ద్విచక్రవాహనాల వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు సంభవించిన లారీ ప్రమాదాల్లో డ్రైవర్లు, క్లీనర్లు కలిపి ఇద్దరు చనిపోయారు. భారీ వాహనాల కారణంగా కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు, పాదచారులు కలిపి సుమారు 80 మంది వరకు మృతిచెందారని అంచనా. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల మధ్య జరిగే ప్రమాదాల్లోనే అధిక ప్రాణనష్టం సంభవిస్తోంది. డిచ్‌పల్లి, ఇందల్‌వాయి, మాక్లూర్‌ బైపాస్‌, ఆర్మూర్‌ పరిసరాల్లో హైవే పక్కన ఉన్న దుకాణాల వద్ద హైవే మార్జిన్‌లోనే వాహనాలను నిలుపుతున్నారు. ఇండికేటర్లు, హెచ్చరిక కోన్లు లేకపోవడంతో తెల్లవారుజామున వెనుక నుంచి వచ్చే వాహనాలు వీటిని నేరుగా ఢీకొంటున్నాయి. పోలీసు శాఖ, ‘ఐరాడ్‌’ సంస్థ, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సమీక్షలోనూ అధికారులు ఇదే విషయాన్ని గుర్తించారు. దీనికి తోడు నిద్రమత్తు, అతివేగం, అదుపుతప్పడం, మద్యం మత్తు కారణంగా ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. హైవేలపై అతివేగంగా వెళ్లే వాహనాలను నిరంతర తనిఖీలతో కట్టడి చేయాలి. లారీలు, కంటెయినర్లు రోడ్డుపైనే ఆగిపోతే వెంటనే క్రేన్లతో పక్కకు తీయించాలి. విశ్రాంతి, అల్పాహారం కోసం రోడ్ల పక్కన వాహనాలను నిలపకుండా చూడాలి. రోడ్డుపైనే వాహనం నిలిచిపోతే ముందూ, వెనకా రిఫ్లెక్టివ్‌ ట్రయాంగిల్స్‌, కోన్లు హెచ్చరికగా పెట్టాలి. నిద్రమత్తులో ఉండే డ్రైవర్లు విశ్రాంతి తీసుకున్నాకే ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు చేపట్టాలి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.