
భారత్మాల నేషనల్ హైవే వస్తే తమ కష్టాలు తీరుతాయని భావించిన ప్రజలకు.. అదే హైవే ఇప్పుడు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టిందని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. భారత్మాల నేషనల్ హైవే నిర్మాణం జరుగుతున్నా సర్వీస్ రోడ్లు, లింక్ రోడ్లు లేకపోవడంతో తమ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ ప్రజలు, రైతులు నిరసనకు దిగారు. రాజోలి మండల పరిధిలో భారత్మాల హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే హైవే నిర్మాణంలో స్థానిక ప్రజల రాకపోకలకు అవసరమైన సర్వీస్ రోడ్లు, లింక్ రోడ్లను ఏర్పాటు చేయకపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలన్నా.. ప్రధాన రహదారిని చేరుకోవాలన్నా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైవే నిర్మాణంతో రైతుల సమస్యలు మరింత పెరిగాయని గ్రామస్తులు తెలిపారు. పొలాలకు వెళ్లేందుకు, వ్యవసాయ పనులకు అవసరమైన ట్రాక్టర్లు, ఇతర వాహనాలను తీసుకెళ్లేందుకు సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. పంట పొలానికి వెళ్లాలన్నా.. హైవే దాటాలన్నా.. ప్రత్యామ్నాయ మార్గం కోసం కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. సర్వీస్ రోడ్లు, లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రజలు తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే చివరకు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టాల్సి వచ్చిందని మండల ప్రజలు పేర్కొన్నారు. భారత్మాల హైవే నిర్మాణంతో ఇబ్బందులు పడుతున్న రాజోలి మండల ప్రజలు, రైతుల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైవేకు అనుసంధానంగా అవసరమైన సర్వీస్ రోడ్లు, లింక్ రోడ్లను వెంటనే ఏర్పాటు చేయాలని, రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా మార్గాలు కల్పించాలని కోరారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నిరసనకారులు హెచ్చరించారు.





