
సిమిలిగుడ : రహదారులే ప్రగతికి మెట్లు అని ప్రసంగాలు చేసే రాజకీయ నేతలు, అధికారులు వాటి నిర్వహణ, పరిరక్షణలో శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా మారుమూల గ్రామాలకు రవాణా సదుపాయం లేక నరకంగా మారింది. నేటికీ అనేక గ్రామాలకు రోడ్లు లేక ప్రజలు పడే అవస్థలు వర్ణాతీతం. ఏజెన్సీ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేక గ్రామస్థులే ఓ రోగిని 10 కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఈ సంఘటన పొట్టంగి సమితిలో జరిగింది. వివరాల్లోకి వెళితే సుంకి గ్రామపంచాయతీకి చెందిన జంకర్‌గుడ గ్రామంలో సావిత్రి అనే మహిళ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం పరిస్థితి ఆందోళనగా మారింది. అయితే ఆ గ్రామానికి అంబులెన్స్‌ రాలేని దుస్థితి. దీంతో బంధువులు, గ్రామస్థులు ఆమెను డోలీలో మోసుకుంటూ ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఓ ఆటోలో ఆంధ్రాలో ఉన్న సాలూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి నరకాన్ని అనుభవిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






