
మెదక్ జిల్లాలో ఇటీవల వింత చోరీలు ప్రజలను, పోలీసులను విస్మయానికి గురిచేస్తున్నాయి. విలువైన వస్తువులతో పాటు సిల్లీగా అనిపించే వస్తువులను కూడా దొంగిలిస్తూ.. దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాజాగా చేగుంట మండల కేంద్రంలో ఇలాంటిదే ఒక విచిత్రమైన దొంగతనం వెలుగు చూసింది. చేగుంటలోని నవదుర్గ హోటల్లో అర్ధరాత్రి సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని హోటల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన సదరు దొంగ, అక్కడ దొరికిన వస్తువులను సర్దేశాడు. ఈ చోరీలో దొంగ సుమారు 300 మీటర్ల పొడవైన కేబుల్ వైరును కత్తిరించి ఎత్తుకెళ్లాడు. అంతవరకు బాగానే ఉన్నా, వెళ్తూ వెళ్తూ హోటల్లో ఉన్న ఒక పెరుగు డబ్బాను, మరికొన్ని చిన్నపాటి కిరాణా వస్తువులను కూడా వదలకుండా పట్టుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
