
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వెల్లడి ఈనాడు, అమరావతి: గ్రామాల్లో రెండున్నరేళ్లలో 20,600 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు. 10 వేల కి.మీ. తారు, మరో 9,600 కి.మీ. సిమెంట్‌ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. గిరిజన గ్రామాలకు ఇంకో వెయ్యి కి.మీ.కు పైగా అడవి తల్లి బాట కింద రోడ్డు సౌకర్యం కల్పించామని ‘ఎక్స్‌’లో బుధవారం వెల్లడించారు. ‘అన్నదాతకు అండగా 1.15 లక్షల పంట కుంటలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం కోసం రైతులకు సాయం చేశాం. పాడి రైతుల కోసం 38 వేల మినీ గోకులాలు, 15 వేల నీటితొట్టెలు నిర్మించాం. ఏడున్నర దశాబ్దాలుగా రోడ్డు చూడని మారుమూల గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల ధ్వంసంతో అపవిత్రమైన రామతీర్థంలో భక్తుల సౌకర్యార్థం ఉపాధి హామీ పథకంలో రోడ్డు నిర్మించాం. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి, కోటప్పకొండ, ఐఎస్‌ జగన్నాథపురం లాంటి వందల కొద్దీ క్షేత్రాలకు వెళ్లే భక్తుల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ రోడ్లు నిర్మించాం’ అని పవన్‌కల్యాణ్‌ వివరించారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన రెండు ఫొటోలను దానికి జత చేశారు. పవన్‌కల్యాణ్‌ పోస్ట్‌ చేసిన రోడ్డు ఫొటో .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





