
పురపాలక శాఖా మంత్రి నారాయణ స్కోచ్‌ అవార్డును ప్రదర్శిస్తున్న మంత్రి నారాయణ, కలెక్టర్‌ హరేంధిరప్రసాద్, ఎమ్మెల్యేలు కొండబాబు, చినరాజప్ప, కమిషనర్‌ సత్యనారాయణ కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కాకినాడ సమగ్రాభివృద్ధికి పలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రాజెక్టులతో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ వచ్చిన మంత్రి ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్, నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, పచ్చదనం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మంత్రి వివరించారు. కాకినాడలో రూ.354 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి తాగునీటి కేటాయింపులపై త్వరలో జీవో విడుదల కానుందన్నారు. నగర పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగు పరచేందుకు రూ.39 కోట్ల వ్యయంతో ఎండ్‌ టు ఎండ్‌ రోడ్లు, కచ్చా రోడ్లను నిర్మిస్తామని వివరించారు. ఇవి పూర్తి కాగానే స్వీపింగ్‌ యంత్రాలతో రహదారులను శుభ్రం చేస్తారని మంత్రి వెల్లడించారు. నగరంలో పార్కుల అభివృద్ధి, పచ్చదనం పెంపునకు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నగరంలో ముంపు సమస్యను పరిష్కరించేందుకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు రూ.200 నుంచి రూ.250 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. వీటిని యూఐడీఎఫ్‌-3, యూఐడీఎఫ్‌-4 పథకాల ద్వారా సమీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నగర ఎమ్మెల్యే కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ, ఎస్‌ఈ పి.వెంకట్రావు, డీసీపీ కృష్ణారనావు, ఎంహెచ్‌వో పృద్వీచరణ్, మెప్మా పీడీ శైలజ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2026వ సంవత్సరానికి నగరపాలక సంస్థకు ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డు లభించడంపై మంత్రి పి.నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఈ అవార్డును అందుకున్న కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణను మంత్రితో పాటు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యే కొండబాబు తదితరులు అభినందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




