
మహమ్మదాబాద్‌లో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించిన నిధుల బిల్లులకు మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తమకు ముందు కావాలంటే.. లేదు తమకే కావాలని పోటీ పడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మే, జూన్‌ నెలల్లో వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘాల నిధులకు ఆరాటపడుతున్నారు. బిల్లుల కోసం మాజీ సర్పంచులు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా పంచాయతీ అధికారులు మండలాల వారీగా గతంలో చేసిన పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అప్పులు చేసి వెచ్చిస్తే..: గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఇతర అభివృద్ధి పనులకు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి ఆర్థిక సంఘం నిధుల నుంచి తీసుకుందామని వేచి ఉండగా, వారి పాలకవర్గం గడువు ముగిసినా నిధులు సకాలంలో రాలేదు. ఆ తర్వాత రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు సైతం మౌలిక సదుపాయాలకు సొంతంగా అప్పులు చేసి పంచాయతీలకు వెచ్చించారు. తాగునీరు, ట్రాక్టర్‌ డీజిల్, ట్రాక్టర్‌ మరమ్మతులు, పారిశుద్ధ్యం, బ్లీచింగ్‌ పౌడర్, ఫాగింగ్‌కు ఖర్చు చేశారు. అంతటా ఇదే తంతు: కొత్త పాలకవర్గం వచ్చాక రెండు, మూడు సార్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి గత పాలకవర్గానికి సంబంధించిన పనులకు ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి.. తమకు కావాలంటూ మాజీ సర్పంచులు పోటీపడ్డారు. లేదు తాము అప్పులు చేసి ప్రత్యేక పాలనలో వెచ్చించామని తాము ముందు తీసుకుంటామంటూ పంచాయతీ కార్యదర్శులు పోటీపడుతున్నారు. పల్లెల్లో ఇదే తంతు కనిపిస్తోంది. సమస్యల సంద్రంలో..: కొత్త పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు విదల్చకపోవడంతో గ్రామాల్లో పనులు ముందుకు సాగడం లేదు. చాలా పల్లెల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. పారిశుద్ధ్య సమస్య ప్రధానంగా ఉంది. దోమ కాటు పెరిగింది. ఫాగింగ్‌ యంత్రాలు పనిచేయడం లేదు. చాలాచోట్ల దోమ నివారణ చర్యలు జరగడం లేదు. రోడ్లు, డ్రైనేజీలు లేక రోడ్లపై మురుగు నిలుస్తోంది. బ్లీచింగ్‌ సైతం చాలా చోట్ల చల్లడం లేదు. తాగునీటి సమస్య సైతం నెలకొంది. కొత్త పాలకవర్గానికి సంబంధించి ఆర్థిక సంఘం నిధులు ఇంకా రాలేదు. గతంలో పనులు చేసిన మాజీ సర్పంచుల వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడుతున్నాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




