
ఫామ్‌ల్యాండ్‌ విక్రయాలపై నజర్‌ ఈనాడు, సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని శివారు ప్రాంతాల్లో ఫామ్‌ల్యాండ్‌.. ఆర్గానిక్‌ ఫామ్‌.. వీకెండ్‌ ఫామ్‌.. ఆక్సిజన్‌ పార్క్‌ల పేరిట అనుమతి లేకుండానే పెద్దఎత్తున స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూములను గుంటలుగా చేసి ప్లాట్లుగా విక్రయించే వ్యవహారాలపై రెరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) దృష్టి సారించింది. నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. గతంలో ఇలానే అమ్మిన ప్రాజెక్టులను గుర్తించాలని నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్‌ జిల్లా నర్సాపూర్, శివ్వంపేట, రామాయంపేట, సిద్దిపేట జిల్లా దుబ్బాక, గజ్వేల్, ములుగు, మర్కూక్‌ తదితర ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారులు కొన్నేళ్లుగా ఫామ్‌ల్యాండ్‌ పేరిట వ్యాపారం కొనసాగిస్తున్నారు. సాగుకు నోచుకోని భూములను సేకరించి రోడ్లు వేసి, వివిధ రకాల మొక్కలు నాటి ఆకర్షణీయమైన పేర్లు పెట్టించి దర్జాగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తూ లావాదేవీలు నిర్వహించారు. కొందరు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. నారాయణఖేడ్, జహీరాబాద్, సిద్దిపేట, గజ్వేల్‌ ప్రాంతాల్లో ఫామ్‌ల్యాండ్‌ పేరిట మోసపోయిన లబ్ధిదారులు ఇప్పటికీ పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పూర్తి వివరాలు తెలియకుండా భూములు కొనవద్దని నారాయణఖేడ్‌లో పోలీసులు బోర్డులు ఏర్పాటు చేశారు. వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించాలంటే ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతరగా మార్పిడి చేయాలి. అనంతరం పంచాయతీ, పురపాలిక అనుమతి తీసుకుని నిబంధనలకు అనుగుణంగా పదిశాతం భూమిని ప్రజాప్రయోజనాలకు వదిలిపెట్టాలి. రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు వు®లిక వసతులు కల్పించాలి. ఇవేమీ లేకుండా కేవలం నాలుగు రోడ్లు, ట్యాంక్‌ నిర్మించి ఫామ్‌ల్యాండ్‌ పేరిట విక్రయాలు చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. అయితే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఇటీవల రెరా నిర్దేశించింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చకుండానే చిన్న భాగాలుగా చేసి విక్రయాలు చేస్తున్న వారిని గుర్తించి రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్‌ చేయించేలా చర్యలు చేపట్టాలని, రెరా ట్రిబ్యునల్‌ అథారిటీ రెవెన్యూ, పోలీసుశాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




