
పండగపూట వెతుకులాడిన ఒంగోలు పోలీసులు ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆకతాయితనంతో ఓ యువకుడు చేసిన పనికి పోలీసులు పండగపూట తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలానికి చెందిన యువకుడు ఒంగోలులో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఒక ఆన్‌లైన్‌ న్యూస్‌యాప్‌నకు అడపాదడపా వార్తలు పంపేవాడు. ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఒక హాస్టల్‌లో ఉంటున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు సదరు యాప్‌కు ఆదివారం వార్త పంపాడు. వినాయకచవితికి స్నేహితులంతా స్వస్థలాలకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నాడు. సదరు వార్తకు తన ఫొటో, పేరు, ఊరు పంపాడు. నిమిషాల్లోనే ఆ వార్త యాప్‌లో రావడంతో ఖుషీ అయ్యాడు. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు, ఫేస్‌బుక్‌ పేజీల్లో ఈ వార్తను నిర్ధారించుకోకుండా, పోలీసులను సంప్రదించకుండా ప్రచురించారు. దీంతో ఆ వార్త వైరల్‌గా మారింది. విద్యార్థి మిత్రులు, కళాశాల నిర్వాహకుల దృష్టికి విషయం వెళ్లటంతో పండుగపూట అంతా హైరానా పడ్డారు. పోలీసులు కళాశాలలు, హాస్టళ్లలో వెతుకులాట ప్రారంభించారు. చివరకు మర్రిపూడి మండలంలోని సదరు విద్యార్థి కుటుంబీకుల ఫోన్‌ నంబర్లు సేకరించి వారితో మాట్లాడారు. తమ కుమారుడు కాసేపటి క్రితమే తమతో మాట్లాడాడని వారు చెప్పటంతో పోలీసులు కంగుతిన్నారు. చివరకు అతడిని కనిపెట్టి ఒంగోలు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి మాట్లాడారు. న్యూస్‌ యాప్‌లో తన వార్తలు రాకపోవడంతో తానే ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త పంపానని అతడు చెప్పడంతో పోలీసులు విస్తుబోయారు. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చిపనులు చేయొద్దని హితవు చెప్పి పంపారు. నిరాధార వార్తలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేముందు వాటిని అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని యూట్యూబర్లు, సామాజిక మాధ్యమాలు వినియోగించేవారికి పోలీసులు సూచించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





