
- మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం – ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ జూలూరుపాడు, సెప్టెంబర్ 16 : విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫాంలు అందజేయక పోవడం దారుణమని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండల పరిధిలోని పలు విద్యాసంస్థల్లో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యుడు బానోతు బాలాజీ అధ్యక్షతన బుధవారం విద్యార్థి సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంశీ మాట్లాడారు. ప్రభుత్వ విద్యపై విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులకు వెంటనే ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలని కోరారు. విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే.. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు అనిల్ కుమార్, సాయి ఈశ్వర్, లితికేష్, జంబో, హరి, శిరీష, సింధు, బన్నీ, నందిని పాల్గొన్నారు.





