
Road Accident | తిమ్మాపూర్, సెప్టెంబర్17: అర్ధరాత్రి సమయంలో హాస్టల్ నుండి బయటకు వెళ్లిన విద్యార్థులకు ఊహించని ప్రమాదం జరగ్గా.. ఓ విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. కరీనంగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు రాత్రి 12 గంటల సమయంలో శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని ఒక బేకరీకి వెళ్లి, తిరిగి హాస్టల్ కు వస్తున్నారు. ఈ క్రమంలో వారు హాస్టల్కు తిరిగి వస్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది. అదే సమయంలో అటుగా ఫ్యామిలీతో వెళ్తున్న ఓ కారు యజమాని విద్యార్థులను చూసి చల్లించి తన కారులో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలు సిరిసిల్లకు చెందిన భవానిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో మృతురాలితో పాటు మరో ముగ్గురు ఉండగా, వారితో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





