
వర్జీనియా: యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతతనిచ్చే గొప్ప ప్రక్రియ అని గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు.
అమెరికాలోని వర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీపతంజలి మహర్షి, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ .. ‘‘యోగా అనేది కేవలం శారీరక వ్యాయాయమే కాదు. శరీరం, మనస్సును సమన్వయం చేసే గొప్ప భారతీయ సంప్రదాయం. యోగా ద్వారా ఆరోగ్యం, ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మన జీవితంలో అత్యంత అవసరమైన సాధనంగా యోగా మారిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు.. యోగ ప్రక్రియను ప్రజలకు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. గతేడాది నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది’’ అని వివరించారు.
కార్యక్రమాన్ని సమన్వయ పరిచిన భాను ప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ.. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. మన పెద్దలు అందించిన అమూల్యమైన కానుక యోగాను 175 దేశాల్లో ఆచరిస్తున్నారని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని అగ్రరాజ్యమైన అమెరికాలో జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. మాతృభాష తెలుగును ఈ తరానికి అందించడం మన బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు మైనేని రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. యోగా ప్రకృతి ప్రసాదించిన వరం అని, నిలబెట్టుకోవటం, సాధన చేయటం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ అమరవాది.. పలు యోగాసనాలలో మెళకువలు చెప్పారు. సీతారామారావు ఎండూరు, రమేష్ అవిర్నేని, మురళి కట్ల, హనుమంతురావు వెంపరాల, చంద్రనాధ్ నంబూరు, శంకర్రావు పొన్నం, పూర్ణచంద్రరావు అన్నం, వెంకటేశ్వరరావు సామినేని, ఈశ్వర్ కక్కెర, వెంకటరెడ్డి గోలి, సుబ్బారెడ్డి జొన్నల, కృష్ణయ్య, రమణ, సురేష్ లగిశెట్టి, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, ప్రభులింగం బచ్చు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.