
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tirumala Rush: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం పూట సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు పలు రాష్ట్రాల న్యాయమూర్తులు స్వామిని దర్శించుకున్నారు. దీంతో భక్తులతో తిరుమల కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగిసినా కూడా భక్తుల తాడికి తిరుమలకు తగ్గడం లేదు. వారికి ప్రత్యేక దర్శనం కల్పించిన అనంతరం టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సినీ ప్రముఖులు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చెన్నై లవ్ స్టోరీ చిత్ర బంధం కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమల స్వామిని ఆదివారం ఉదయం కిరణ్ అబ్బవరంతోపాటు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాత శ్రీనివాస్ కుమార్, రచయిత అనంత శ్రీరామ్, సంగీత దర్శకుడు మణిశర్మ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించిన టీటీడీ అధికారులు.. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. దర్శనానంతరం సినిమా బృందం ఆలయం వెలుపల సందడి చేశారు. తమ సినిమా విజయం సాధించాలని.. ప్రేక్షకుల ఆదరణ పొందాలని స్వామివారి సన్నిధిలో వారు ప్రార్థించినట్లు సినీ నటుడు కిరణ్ అబ్బవరం తెలిపారు
న్యాయమూర్తులు శ్రీవారిని తెలంగాణ, మేఘాలయ న్యాయమూర్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేఘాలయ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రామలింగం సుధాకర్, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి శ్రవణ కుమార్ ఆలయ దర్శనానికి రాగా.. అధికారులు వారికి వేద ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు .
తిరుమలలో భక్తుల రద్దీ వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలోని క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 2-5 గంటలు దర్శనానికి సమయం పడుతుంటా.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-6 గంటల సమయం కొనసాగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 20వ తేదీన స్వామివారిని 93,303 మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. స్వామివారికి తలనీలాలు 46,688 మంది భక్తులు సమర్పించగా.. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు వచ్చింది.