
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
KTR Requests To Public: 'అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తాను గుంపు మేస్త్రి అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడు. ఈ ప్రభుత్వానికి సగం కాలం పూర్తయింది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో లూటీలు జరుగుతున్నాయి.. కానీ హైదరాబాద్ నగరంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు అని చెప్పారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్‌నగర్‌లో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 60 సంవత్సరాలుగా హనుమాన్ నగర్ బస్తీలో నివసిస్తున్న తమను బలవంతంగా తరలించి.. ఆ భూములను ప్రభుత్వం అమ్మేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని బస్తీవాసులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అందించిన పట్టాలను కూడా రద్దు చేసి.. తమ భూములను లాక్కోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్న బస్తీబాటలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో హనుమాన్ నగర్ ప్రజల జోలికి ఎవరూ రాలేదని గుర్తుచేశారు. హనుమాన్ నగర్ బస్తీ మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఐక్యంగా ఉంటే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల సమస్యలను అర్థం చేసుకునే తెలివితేటలు కూడా లేవని మండిపడ్డారు.
'ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి... మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాది' అని బస్తీవాసులకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ ఒక్క సంవత్సరం పాటు మీ ఇండ్లను మీరే కాపాడుకోండి... కాంగ్రెస్ నాయకుల మాటలకు మోసపోవద్దని సూచించారు. పెద్దలకు ఒక నీతి... పేదలకు మరో నీతి అన్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి, ప్రస్తుతం స్థానిక ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. మేమంతా మీకు అండగా ఉంటాం. ఎవరూ భయపడకండి' అని మాజీ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎన్నికల హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు.