
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Fathers Day Turns Tragedy: ప్రపంచమంతా ఫాదర్స్ డేను ప్రశాంతంగా.. ఆనందోత్సాహాలతో చేసుకుంటుండగా.. తెలంగాణలో మాత్రం తీవ్ర విషాదం నింపింది. ఫాదర్స్ డే రోజే పలు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ తల్లి కాపురంలో కలహాలతో తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోగా.. తండ్రిని ఒంటరిని చేసింది. మరో ఘటనలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకుతోపాటు ఓ మహిళ కూడా మరణించారు. ఈ సంఘటనలన్నీ కూడా ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నాయి.
రోడ్డు ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం, మాదారం అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన (భార్యాభర్తలు, కొడుకు) ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లికి తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు సాయి ప్రకాష్, సంధ్య, వారి కొడుకు మోక్షిత్ (ఐదు సంవత్సరాలు) ఉండగా.. వారి తల్లి జ్యోతికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
బంధువుల ఇంటికి వెళ్లి ప్రమాదానికి గురయిన కుటుంబం మొత్తం భద్రాచలం పట్టణానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరంతా ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
కాపురంలో కలహాలు ఖమ్మం జిల్లాలో ఓ వివాహిత తనతోపాటు తన ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి ప్రాణాలు తీసింది. వారి ముగ్గురు మరణంతో ఓ తండ్రి దిక్కులేని వాడుగా మారాడు. ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్‌కు లింగరాజు, స్వాతి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్ (7), తనిష్క్ (5)తో ఉన్నారు. అయితే నిత్యం కాపురంలో కలహాలు ఉండడంతో భార్యాభర్తలు నిత్యం గొడవపడేవారు. ఈ క్రమంలో స్వాతి క్షణికావేశానికి గురయి తన ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి.. తానూ తిని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే లింగరాజు స్పందించి వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించగా.. స్వాతి పరిస్థితి విషమంగా ఉంది.
వివాహేతర సంబంధంతో హత్య కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుంచుపల్లి మండలం పెనగడప అంబేద్కర్ నగర్లో తన భార్యను వేధిస్తున్నాడని అనుమానంతో నాగరాజు అనే వ్యక్తిని కత్తితో పొడిచి ఓ దుండగుడు హత్య చేశాడు. ఓ ఫంక్షన్ హాల్లో నాగరాజుకు శివాజీకి మధ్య ఘర్షణ జరిగింది. కక్షపెంచుకున్న శివాజీ పథకం ప్రకారం నాగరాజును రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో విచక్షణా రహితంగా కడుపులో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 'పాల్వంచ పెద్దమ్మ గుడిలో జరిగిన ఫంక్షన్లో శివాజీ తన భార్యతో వెళ్లగా అదే ఫంక్షన్‌కు హాజరైన నాగరాజు గొడవ పడ్డాడు. శివాజీకి తన భార్యకు నాగరాజు మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానం ఉంది. ఫంక్షన్‌కు తన భార్య కోసమే నాగరాజు వచ్చాడని శివాజీ ఆగ్రహంతో నాగరాజుతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది' అని మృతుడి మేనత్త తెలిపారు. ఈ ఘటనపై రామవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.