
రాజోలి: జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ల వద్ద వినాయక నిమజ్జనాలు చేసే ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిమజ్జన ప్రాంతానికి పెద్ద విగ్రహాలు, వాహనాలు సులభంగా చేరుకునేలా రహదారి చదును చేయడం, అవసరమైన చోట్ల మట్టి, మొరం, రాళ్లను ఉపయోగించి దారిని మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్ద విగ్రహాలను తరలించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తగినంత లైటింగ్‌తోపాటు భారీ వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలన్నారు. మత్స్యకారులు, గజ ఈతగాళ్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. వారి వెంట ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





