
ఆ కమిషన్‌ నియామక ఉత్తర్వులను మా ముందుంచండి సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలు ఇవ్వండి రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం బీసీలకు 34% రిజర్వేషన్లపై వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి తీర్పు వాయిదా ఈనాడు, అమరావతి: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌రంజన్‌ మిశ్ర ఛైర్మన్‌గా ఏర్పాటుచేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ ఉద్దేశమేంటి, ఈ కమిషన్‌ ఏ అంశాలపై అధ్యయనం చేసిందనే వివరాలను తాము పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. కమిషన్‌ నియామక ఉత్తర్వుల ప్రతిని తమ ముందుంచాలని రాష్ట్రప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రణాళికశాఖ నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వేలో సేకరించిన వివరాల ఆధారంగా బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నంద]ున ఆ గణాంకాలు ఇవ్వాలని ఆదేశించింది. సర్వే ఉద్దేశమేంటో పరిశీలిస్తామంది. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలుచేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు బుధవారం ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల జీవోలను రద్దుచేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఇదే వ్యవహారంపై కృష్ణాజిల్లాకు చెందిన పి.వెంకట నరసింహశర్మ మరో పిల్‌ వేశారు. బీసీలకు 34% రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 50% దాటిపోతాయన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, జీవోలను రద్దుచేయాలని కోరారు. ప్రభుత్వానికి అధికారం ఉంది పం చాయతీరాజ్, పురపాలకశాఖ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపిస్తూ.. ‘బీసీల స్థితిగతులపై మిశ్ర కమిషన్‌ నివేదికలోని గణాంకాలు, సమగ్ర కుటుంబసర్వే వివరాల ఆధారంగా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాం. రాష్ట్రంలో బీసీ జనాభా 50.42%. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని 50% మించి రిజర్వేషన్ల కల్పనపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు రాష్ట్రప్రభుత్వాలకు ఉంటుంది. మహారాష్ట్ర స్థానికసంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు 50% దాటినా ఎన్నికలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అదనపు రిజర్వేషన్‌ అమలు తమ తుదితీర్పునకు లోబడి ఉంటుందని చెప్పింది’ అన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తప్పుపడుతూ న్యాయస్థానాలు ఓసారి తీర్పులిచ్చాక.. మళ్లీ ఎలా ‘పునరుద్ధరిస్తారు’ అని ధర్మాసనం ప్రశ్నించింది. డెడికేటెడ్‌ కమిషన్‌ గణాంకాలను కోర్టుకు ఇవ్వాలని సూచించింది. తాము నివేదికను కోరడం లేదని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. డెడికేటెడ్‌ కమిషన్‌ డేటాను సేకరించలేదని, రాష్ట్ర ప్రణాళికాశాఖ గణాంకాలపైనే ఆధారపడిందన్నారు. గణాంకాలను ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. పి టిషనర్‌/న్యాయవాది తాండవ యోగేష్‌ వాదనలు వినిపిస్తూ.. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికలో, సమగ్ర కుటుంబసర్వేలో బీసీల జనాభా 50.42% అని తేలినా బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు. జనాభాలో 70% బీసీలున్నా మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు. అలా దాటడం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు విరుద్ధం. ప్రస్తుతం బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడంతో గ్రామీణ స్థానికసంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 61.08% అవుతాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ట్రిపుల్‌ టెస్ట్‌ విధానాన్ని పాటించాలి. మొదట డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటుచేయాలి. తర్వాత స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ స్థితిగతులపై ఆ కమిషన్‌ అధ్యయనం చేయాలి, అంతిమంగా మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు. ట్రిపుల్‌ టెస్ట్‌ విధానాన్ని అనుసరించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. గతంలో కోర్టులు రద్దుచేసిన రిజర్వేషన్‌ విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో జీవోలను రద్దుచేయండి. 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించండి’ అని కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





