
రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధిక ప్రభావం 2.44 లక్షల హెక్టార్లలోని పంటలపై ఆశలు వదులుకోవడమే! ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులు మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దొడ్డంపల్లెలో ఎండుముఖం పట్టిన పత్తి మొక్కలు ఈనాడు, అమరావతి: ఎల్‌నినో ప్రభావం రోజు రోజుకు తీవ్రమవుతోంది. అల్పపీడనంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నా.. రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి. పల్నాడు, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే వేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. పత్తి, కంది, మినుము, ఆముదం, వేరుశనగ తదితర పంటలు ఎండుముఖం పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26.50 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా.. అందులో 2.44 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని పంటలపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో సుమారు 41,474 హెక్టార్లలో వేసిన పైర్లు ఎండు దశకు చేరాయి. 10,582 హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. మరో 1,92,387 హెక్టార్లలోని పంటలు తీవ్ర బెట్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 284 మండలాలు, 1,792 రైతు సేవా కేంద్రాల పరిధిలోని పంటలపై ఎల్‌నినో తీవ్రత అధికంగా ఉంది. ఖరీఫ్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 51% లోటు వర్షపాతం నెలకొంది. సంజీవరాయునిపేటలో వాడిపోయిన మినుము పోలవరం జిల్లా కూనవరం మండలం గండి కొత్తగూడెంలో నీరందక పగుళ్లిచ్చిన వరి పొలం రెండు రోజులుగా భారీ వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో ఊరట అ ల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా వరకు కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, ఎన్టీఆర్, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. శనివారం అత్యధికంగా బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురంలో 110 మి.మీ, కృష్ణా జిల్లా గంగూరులో 98.25, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 92, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 88.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిశీలిస్తే.. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. మెట్టపైర్లకు వర్షాలు అనుకూలించాయి. అయితే ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేవు. అందుబాటులో ఉన్న నీటివనరులతో రక్షక తడులివ్వండి -మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు అం దుబాటులో ఉన్న నీటివనరులను వినియోగించి తీవ్ర బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పంటలకు రక్షక తడులు ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడితో కలసి ఆదివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పంట ఆరోగ్య వివరాల నమోదును గణాంకాల కోసమే కాకుండా.. ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉందో గుర్తించి.. రైతు సాయం అందేలా చూడాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల కింద వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని నిమ్మల రామానాయుడు సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 34,567 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు చర్యలు చేపట్టామని, ఇంకా 95వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేయించాల్సి ఉందని అధికారులు వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




