
నగరంలో అటెన్షన్‌ డైవర్షన్‌ ముఠాల హల్‌చల ఈనాడు, హైదరాబాద్‌: రద్దీ ప్రాంతాల్లో పాగా వేస్తారు.. జనం మధ్యలో చేరి విలువైన వస్తువులు కొట్టేసి మాయమవుతారు. ఒకే రోజు వీలైనంత పెద్ద మొత్తం చేతికి వచ్చాక మరోచోటికి మకాం మారుస్తారు. నగరంలో అటెన్షన్‌ డైవర్షన్‌ దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఒక్కో ముఠా తమదైన శైలిలో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణకు చెందిన దొంగలు దృష్టిమరల్చి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక ముఠా మహిళలను లక్ష్యంగా చేసుకుంటే.. కొందరు వృద్ధులు, అమాయకులను ఎంచుకొని మోసాలకు తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా బురఖా ధరించి వయోధికులను ఎంచుకొని చోరీలకు పాల్పడుతోంది. ఆరుగురు సభ్యులున్న మహిళల ముఠా లాడ్జీల్లో మకాం వేస్తారు. ఆసుపత్రులు, షాపింగ్‌మాల్స్‌ వంటి రద్దీ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. నగదుతో వెళ్తున్న వృద్ధులను ఎంచుకొని ఒకేసారి చుట్టుముడతారు. గొడవ సృష్టించినట్లు హంగామా చేస్తారు. సంచి, పర్సులు కొట్టేస్తారు. వరుసగా నేరాలు చేసి మరో నగరానికి చేరతారు. తమిళనాడు ముఠాలో 4-5మంది సభ్యులుంటారు. ఏటీఎం కేంద్రాల వద్ద నగదు విత్‌డ్రా చేయడంలో సాయం చేస్తున్నట్లు నటిస్తారు. డెబిట్‌కార్డు, పిన్‌నంబరు తీసుకుంటారు. ఏటీఎం పని చేయట్లేదని తమ వద్ద ఉన్న డెబిట్‌కార్డు ఇచ్చి పంపుతారు. తర్వాత ఆ పిన్‌నంబరు ఉపయోగించి నగదు తీసుకుంటారు. నాలుగైదు ముఠాలు తిరుగుతున్నట్లు సమాచారం. కొందరు పాతనేరస్థులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. నానల్‌నగర్‌ సమీపంలో ఆటోలో ఉన్న ఒక వయోధికుడి నుంచి రూ.లక్షల విలువైన నగలు కొట్టేసి పారిపోయారు. ఆటో అద్దెకు తీసుకొని వయోధికులను ఎక్కించుకుంటారు. అప్పటికే ప్రయాణికులుగా ఉన్న దొంగలు అవకాశం దొరగ్గానే నగదు, నగలుకొట్టేస్తారు. మహిళలు, పురుషులు ముఠాగా సిటీ బస్సుల్లో చేరి తోపులాట జరిగినట్లు నాటకమాడి గొలుసులు, పర్సులు చోరీ చేస్తారు. తాజాగా మంగళ్‌హాట్, గోషామహల్, బేగంబజార్‌లోని దుకాణాల్లో కొనుగోలుదారులుగా వెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బురఖాలు ధరించి కొనుగోలుదారులుగా వస్త్ర, నగల దుకాణాల్లోకి వెళ్లిచీరలు, ఆభరణాలు కాజేసి పారిపోతున్నారు. ఈ ముఠాలో ఇద్దరు హిజ్రాలున్నట్లు గుర్తించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





