
ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. నిన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.



