తెలుగు సినిమా ప్రపంచంలో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు వాణి శ్రీ. కష్టాలు, సవాళ్లు దాటి విజయ తీరాలకు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. సాధించాలన్న పట్టుదల, సంకల్పబలం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని సినీ రంగంలో అద్భుతంగా నిరూపించిన కళాభినేత్రి వాణిశ్రీ. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. 1948 ఆగస్టు 3న నెల్లూరులో రాఘవయ్య నాయుడు, వెంకమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో, తల్లి వెంకమ్మ ఇద్దరు ఆడపిల్లలతో మద్రాసుకు చేరారు. అక్కడ ఆంధ్రా మహిళా సభలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన రత్నకుమారి, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం కూడా నేర్చుకున్నారు. అనంతరం భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఈ సమయంలోనే ఆమెకు నటన పట్ల ఆసక్తి పెరిగింది. రత్నకుమారి మొదటగా “రక్తకన్నీరు” నాటకంలో నటించారు. నటుడు నాగభూషణంకు చెందిన రవి ఆర్ట్ థియేటర్స్‌లో సభ్యురాలిగా చేరి, నటి సీత వద్ద నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. “దొంగ”, “రాగరాగిణి” వంటి నాటకాలలో నటించిన ఆమెకు, “చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం జీవితంలో కీలక మలుపు. మద్రాస్‌లోని ఆంధ్రా క్లబ్లో జరిగిన ఈ నాటక ప్రదర్శనకు చిత్తూరు నాగయ్య, కన్నడ దర్శకుడు హున్సూర్ కృష్ణమూర్తి హాజరయ్యారు. చిట్టెమ్మగా రత్నకుమారి నటనకు ఆకట్టుకున్న కృష్ణమూర్తి, తన కన్నడ చిత్రం “వీర సంకల్ప”లో ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశారు. అలా 1979లో పెళ్లి చేసుకునేంత వరకు ఆమె సినీ జీవితం అప్రతిహతంగా సాగింది.