
ఇంటి ఎదుట బైఠాయించిన వెంకటమ్మ కాప్రా, న్యూస్‌టుడే: కుమార్తెలు కన్న తల్లి ఆస్తి లాక్కొని ఆమెను ఇబ్బందిపెడుతున్నారు. దీంతో తన ఇంటి ఎదుటే ఆ మాతృమూర్తి నిరసన చేపట్టింది. కుషాయిగూడ డివిజన్‌ నాగార్జుననగర్‌ ఒకటో వీధిలో ఉంటున్న కందాడి ధర్మారెడ్డి, వెంకటమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వీరికి వివాహాలు జరిపించారు. కలహాలు, పలు కేసులతో సతమతమైన ధర్మారెడ్డి కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు నాలుగేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. వెంకటమ్మ ఒంటరైంది. తన సొంత ఇంట్లో ఉంటూ అద్దెలతో జీవిస్తోంది. తల్లిని బాగా చూసుకుంటామన్న హామీతో ఆస్తిని కుమార్తెల పేరున రాసింది. కొంతకాలంగా కుమార్తెలు తల్లిని వేధిస్తున్నారు.ఇంట్లోనే ఉంటున్న చిన్న కుమార్తె అద్దెలు తీసుకుంటూ పెత్తనం చెలాయిస్తోంది. ఇంట్లోని సీసీ కెమెరాలను ఆఫ్‌ చేసి చిత్రహింసలు పెడుతోంది. వారంక్రితం తల్లిని బయటకు గెంటేసింది. వెంకటమ్మను స్థానికులు కోహెడలో బంధువుల ఇంటికి పంపించారు. బుధవారం వచ్చిన తల్లిని కుమార్తె లోపలికి రానివ్వలేదు. దీంతో వెంకటమ్మ ఇంటి ఎదుటే బైఠాయించింది.పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. వెంకటమ్మ కుమార్తెలకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని, కేసును కీసర ఆర్డీవోకు రిఫర్‌ చేసినట్లు కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


