నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం మహారాజా ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ కానుంది. 2024లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా, చైనాలో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అక్కడ థియేటర్లలో ₹91 కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోనూ ప్రశంసలు అందుకుంది. ఈ అపూర్వమైన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఒక ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ మహారాజా రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలలో ఒకరైన సుధన్ సుందరం అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. హాలీవుడ్ రీమేక్ చిత్రంలో ప్రధాన పాత్రలో హాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణి నటుడు మ్యాథ్యూ మెకానాహే కనిపించనున్నారని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.