
క్రాస్‌ ఫైర్, మిస్‌ ఫైర్, విడాకులు ఉండవు నెల్లూరు జిల్లా కోవూరులో కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేశ్‌ ఆర్‌ఎస్‌ఆర్, డీఎస్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన మంత్రి కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి లోకేశ్, వేదికపై ఎంపీలు వేమిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు ఈనాడు, నెల్లూరు: రానున్న 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలోని పార్టీలు కలిసే పోటీచేస్తాయని..కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. క్రాస్‌ ఫైర్, మిస్‌ ఫైర్, విడాకులు ఉండవని.. పార్టీ అధినేతలుగా తమకు ఎలాంటి సందేహాలూ లేవని.. వస్తే తాను పవనన్నకు నేరుగా ఫోన్‌ చేస్తానని చెప్పారు. చిన్నచిన్న సమస్యలుంటే నేతలు మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో అద్భుతమైన నాయకత్వం ఉందని.. నియోజకవర్గాన్ని కంచుకోటగా తయారు చేయాలని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనమే గెలవాలని పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి నెల్లూరు నగరంతో పాటు, కోవూరులో పర్యటించారు. నెల్లూరు నగరంలో వీపీఆర్‌ ఫౌండేషన్, డీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నిధులతో ఆర్‌ఎస్‌ఆర్, డీఎస్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించారు. తర్వాత ర్యాలీగా కోవూరు బైపాస్‌కు చేరుకుని ఎన్టీఆర్‌ భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత కోవూరు ఉషోదయ డెయిరీ పార్లర్‌ వద్ద తెదేపా కార్యకర్తలు, నేతలతో పార్టీ క్యాడర్‌ సమన్వయ సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడారు. స్థానిక సంస్థలకు అక్టోబరు, నవంబరులో ఎన్నికలు జరుగుతాయని.. కూటమి పార్టీల అభ్యర్థులకు విజయం ఏకపక్షం కావాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. వైకాపా నాయకులు ఫస్ట్‌ గ్రేడ్‌ క్రిమినల్స్‌ అని.. రాజకీయం ముసుగులో కుల, మత విభేదాలు రెచ్చగొడతారని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. తమకు వారి మాదిరిగా దొంగ పేపర్లు, టీవీ ఛానళ్లు లేవని.. కానీ కోటిమంది కార్యకర్తలు ఉన్నారని.. అంతా మాట్లాడితే వారు ఎన్నిరాసినా ప్రజలు నమ్మరని చెప్పారు. చేసిన మంచితో పాటు గొడ్డలి పార్టీ కుట్రలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత క్యాడర్‌పై ఉందన్నారు. డీఎస్‌ఆర్‌ పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో మంత్రులు లోకేశ్, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, దాత దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మంత్రి నారాయణ కుమార్తె షరణి తదితరులు కోవూరులో ఎన్టీఆర్‌ విగ్రహం లేని లోటు తీర్చిన వేమిరెడ్డి దంపతులకు అభినందనలు తెలిపారు. కోవూరు తెదేపా కంచుకోట అని ఇప్పటివరకు ఎనిమిది సార్లు గెలిచామన్నారు. డబ్బులు ఎంతోమంది సంపాదిస్తారని.. కానీ ప్రజల కోసం ఏదో చేయాలనే తపన వీపీఆర్‌ దంపతుల్లో ఉందని అందుకే వీరు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. గొడ్డలి పార్టీ అధినేతకు డీఎస్సీ అంటే డ్రగ్స్, శాండ్, చీప్‌లిక్కర్‌ గుర్తుకొస్తాయని లోకేశ్‌ఎద్దేవా చేశారు. ‘మళ్లీ ఛాలెంజ్‌ చేస్తున్నా.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం..జగన్‌ నువ్వు సిద్ధమా’ అని సవాల్‌ విసిరారు. అరిగిపోయిన రికార్డులా డీఎస్సీలో అవకతవకలు అంటూ అబద్ధాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు నిజాన్ని ఎక్కువసార్లు ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజల కోసం ప్రశాంతిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని మంత్రి లోకేశ్‌ అన్నారు. కొంతమంది రౌడీలు, నియోజకవర్గానికి ఒక్క పని కూడా చేయనివారు ఆమె గురించి మాట్లాడుతున్నారని.. వీపీఆర్‌ కుటుంబం గురించి మాట్లాడే హక్కు వైకాపా నాయకులకు ఎవరిచ్చారని నిలదీశారు. మరోసారి అటువంటి మాటలు మాట్లాడితే వారి సంగతి చూస్తామన్నారు. గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడో చూశామని.. ఈ రోజు అతడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని కార్యకర్తలు సమర్థంగా పూర్తిచేయాలని లోకేశ్‌ కోరారు. నాయకుల చుట్టూ కాకుండా కార్యకర్తలు ప్రజల చుట్టూ తిరగాలని.. వారిని గుర్తించే బాధ్యత తనదన్నారు. కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎండీ.ఫరూఖ్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




