
జూలై నెలలో గురువు ఉచ్ఛ స్థితిలో కొనసాగడం, బుధుడు తన స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ప్రవేశించడం, శుక్రుడు సింహ రాశిలో సంచారం ప్రారంభించడం వంటి కారణాల వల్ల కొన్ని రాశులు అదృష్ట రాశులుగా కొనసాగబోతున్నాయి.
ఈ రాశుల వారి జీవితాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. జూలై నెలంతా ఈ రాశులకు తిరుగుండదు. ఇందులో మేషం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులున్నాయి. ఆదాయ వృద్ధి, అధికార యోగంతో పాటు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం కావడం, పెళ్లి సంబంధం కుదరడం, ఉద్యోగంలో ప్రవేశించడం వంటివి ఈ రాశుల వారికి జరుగుతాయి.
మేషం: ఈ రాశివారికి గురు, శుక్ర, బుధుల బలం క్రమంగా పెరగడంతో పాటు రాశ్యధిపతి కుజుడు కూడా ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు జూలైలో నక్కతోకను తొక్కే అవకాశం ఉంది. వీరు అత్యంత అదృష్టవంతులు, భాగ్యవంతులు అయ్యే అవకాశం ఉంది. ఆదాయం దినదినాభివృద్ది చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదురుతుంది. గృహ ప్రవేశ యోగం కూడా ఉంది.
మిథునం: రాశ్యధిపతి బుధుడు స్వక్షేత్రంలోనూ, ధన స్థానంలోనూ సంచారం చేయడం, గురువు ఉచ్ఛస్థితిలో ధన స్థానంలో కొనసాగడం వల్ల ఈ రాశివారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, లాభ స్థానంలో కుజుడు, ధన స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల అదృష్టం ఈ రాశివారి ఇంటి తలుపు తడుతుంది. ఏ విధంగా చూసినా ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది..
కన్య: దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల, ముఖ్యంగా లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. సంతాన యోగ సూచనలున్నాయి.. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని, సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమై, ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశముంది. ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు హ్యాపీగా పురోగమిస్తాయి.
మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో శుభ గ్రహాలు చేరడం, రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడంతో పాటు ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తులు కొనే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడం, స్థిరత్వం లభించడం జరుగుతాయి. జీవనశైలి మారిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. శుభ కార్యాలు జరుగుతాయి.