
Amazon Now | ఇంటర్నెట్‌డెస్క్: క్విక్ కామర్స్ విభాగంలో పోటీ మరింత తీవ్రం కానుంది. ప్రస్తుతం ఈ విభాగంలో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో పోటీ పడుతుండగా..
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఈ మధ్యే రేసులోకి దిగింది. ప్రస్తుతం ప్రధాన నగరాలకే పరిమితమైన తన ‘అమెజాన్ నౌ’ క్విక్ కామర్స్ సేవలను మరింత విస్తరించనుంది. దేశంలోనే అతిపెద్ద క్విక్ కామర్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో 300 నగరాలకు అమెజాన్ నౌ సేవలను విస్తరించనున్నట్లు కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ప్రకటించారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆయన.. బుధవారం అమెజాన్ మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విస్తరణ ప్రణాళికను ప్రకటించారు.
ప్రస్తుతం అమెజాన్ నౌ సేవలు హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ- ఎన్సీఆర్, ముంబయి, పుణె వంటి 15కు పైగా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. దీనిని మరింత వేగంగా విస్తరించడానికి మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను అమెజాన్ భారీగా పెంచనుంది. 300 నగరాలకు ఈ సేవలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెజాన్ నౌ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని అమెజాన్ ఇండియా అధిపతి సమీర్ కుమార్ తెలిపారు. అమెజాన్ ఇండియా చరిత్రలోనే ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిజినెస్ యూనిట్‌గా నిలిచిందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.