
బూర్గంపహాడ్, జూన్ 22 : బూర్గంపహాడ్ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. తొలుత బూర్గంపహాడ్ గురుకుల విద్యాలయాన్ని సందర్శించి కిచెన్హెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి...
బూర్గంపహాడ్, జూన్ 22 : బూర్గంపహాడ్ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. తొలుత బూర్గంపహాడ్ గురుకుల విద్యాలయాన్ని సందర్శించి కిచెన్హెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గృహాలను తనిఖీ చేశారు. కిచెన్ షెడ్లో విద్యార్థులకు అందించే భోజన నాణ్యత, వంట తయారీ విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. వంటశాల, భోజనశాల పరిసరాల్లో పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తూ అక్కడ ప్రదర్శించిన భోజన మెనూ చార్ట్‌ను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలన్నారు. అనంతరం తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెనూ అమలులో లోపాలు లేకుండా చూడాలన్నారు. అనంతరం స్టోర్ రూమ్‌లో నిల్వచేసిన బియ్యం, పప్పుధాన్యాలు నిత్యావసర సరుకులు, కూరగాయల నాణ్యత పరిశీలించి తాజా కూరగాయలనే వాడాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడవద్దని సూచించారు. విద్య, వసతి, భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకుని నూతన విద్యాసంవత్సరంలో విద్యార్థుల చేరికలు, హాజరు శాతం, బోధన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులను అడిగి తెలుసుకుని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ గ్రామంలో శ్రీలక్ష్మి గణపతి ఫెర్టిలైజర్(ఎరువుల దుకాణం)ను కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో పత్తి విత్తనాల ప్యాకెట్లు, వివిధ రకాల ఎరువులు, పురుగుమందుల నిల్వలను పరిశీలించి స్టాక్ రిజిస్టర్‌ను తెప్పించి చూశారు. గోదాములో నిల్వ ఉంచిన యూరియా బస్తాలను పరిశీలించి నిల్వల పరిస్థితిని సమీక్షించారు. రైతులకు తగినంత నిల్వలు ఉన్నాయా లేదా అని వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు.
రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్లు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. స్టాక్ రిజిస్టర్లు ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిల్వలు, విక్రయాల వివరాలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ సీజన్ నేపధ్యంలో రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండావ్యవసాయ అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని, అధిక ధరలకు విక్రయాలు, అక్రమ నిల్వలు ఉన్నట్లు తేలితే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో జమలారెడ్డి, తహశీల్దార్ కేఆర్కే ప్రసాద్, మండల వ్యవసాయాధికారి శంకర్, డీటీ సమ్మయ్య, ఎంపీవో రామకృష్ణ, గురుకులం ప్రిన్సిపాల్ నాగజ్యోతి, హౌసింగ్ ఏడీ, జీపీవోలు పాల్గొన్నారు.