
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Harish Rao vs Revanth Reddy: 'రైతులకు రూ.29,350 కోట్ల భరోసా ఎగ్గొట్టి, బోనస్‌ను బోగస్ చేసి.. ఇప్పుడు కేంద్రం చెబితేనే పంటలు కొంటామంటున్న రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. పక్కా మోసగాడు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇవ్వడానికి పైసల్లేవంటాడు కానీ.. తన గెస్ట్ హౌస్‌కు రూ.100 కోట్లు, కంచెకు రూ.17 కోట్లు.. పక్క రాష్ట్రాల్లో పేపర్ యాడ్స్‌కు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. 'నాడు ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లు.. నేడు పెట్రోల్, డీజిల్, ఎరువులు, చార్జీల పేరుతో రేవంత్ సర్కార్ ప్రజల రక్తం తాగుతూ పన్నుల భారం మోపుతోంది' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లమల గౌరవం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం కొనలేని దద్దమ్మ, బీఆర్ఎస్ను మొలకెత్తనివ్వననడం విడ్డూరం.. రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లోనే రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తాం' అని ప్రకటించారు. 'రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, మోసగాడు. నల్లమల పేరు చెప్పి నల్లమల గౌరవం రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడు' అని తెలిపారు. 'రైతులకు ఇప్పటివరకు రూ.29,350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీపడ్డాడు. ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయింది. మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ను మొలకెత్తనియ్య అని అంటున్నాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం 'కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు, సోయాబీన్, పల్లి, సన్‌ప్లవర్ కొంతమేరే కొంటుంది. కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుంది. ఖరీఫ్ సీజన్లో వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఉమ్మడి పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రకటించారు. 'దళారుల, మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ , ఆయన ఎవరి తోలు తియ్యలే. రాష్ట్రం సాధించిన పార్టీగా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం' అని తెలిపారు.
'తెలంగాణ కోసం రాజీనామాలో చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్ రెడ్డి, పాలకపక్షం అవుతుందని ఒప్పుకున్నాడు. 100 స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డిని, అయన మోసాలను ఎండగడుతూనే ఉండాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు. 'పేరుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు.. ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేశారు. లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే పైసలు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడు' అని విమర్శించారు.
రూ.17 కోట్లతో ఇనుప కంచెలు 'జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో 100 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. గెస్ట్ హౌస్ చుట్టూ రూ.17 కోట్లతో ఇనుప కంచెలు వేసుకున్నాడు. రేవంత్ రెడ్డి మనవడితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు పైసలు ఉంటాయి. కేరళ, బీహార్, మహారాష్ట్ర , ఢిల్లీలో వందల కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి. పేద వర్గాలకు పైసలు ఇచ్చేందుకు డబ్బులు లేవని అంటున్నాడు' అని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు.
ఒక్క రూపాయి ఇవ్వలేదు 'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదు. భూమి బద్దలైనా మల్లొచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. స్కాంల ప్రభుత్వం వద్దు స్కీమ్‌ల ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని గుర్తుచేశారు. ఎవడు అయితే కేసులు పెట్టిండో, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్ అయినా, ఎక్కడున్నా పట్టుకొని వచ్చి బొక్కలో వేస్తామని ప్రకటించారు.
ప్రజలు తిట్టుకునే పరిస్థితి 'కాంగ్రెస్ పాలన కొన్నేళ్ల వరకు ప్రజలు తిట్టుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర యేండ్లు అవుతుంది, ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులలాగా కేసీఆర్ మార్చారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. 'కార్యకర్తలు గట్టిగా పనిచేసి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరెయ్యాలి. అప్పుడు కొడంగల్‌కు ఇంఛార్జ్‌గా ఉండి రేవంత్ రెడ్డిని ఓడించాం. ఈసారి ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలకు 14 బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పూర్తి విశ్వాసం ప్రకటించారు.