
గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు.
ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Bonthu Rammohan: బొంతు రామ్మోహన్ ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మేయర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అంత్యంత దగ్గరగా ఉండే నేతల్లో ఈయన ఒకరు.. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని భావించారు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ సిట్టింగ్‌లకే సీటు అని ప్రకటించడంతో.. ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు.. ఈ అసంతృప్తి కొనసాగుతుండగానే ఎన్నికలు రావడం.. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం వెంటవెంటనే జరిగాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో బొంతు రామ్మోహన్‌కు కాంగ్రెస్ పెద్దలు భారీ హామీలే ఇచ్చారని ప్రచారం సాగింది. సికింద్రాబాద్ ఎంపీగా బొంతు రామ్మోహన్‌కు అవకాశం ఇస్తారని చెప్పారు. కానీ రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో.. టికెట్ ఇవ్వలేదని అన్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్ బైపోల్ లో టికెట్ ఇస్తారని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినా.. చివరకు నవీన్ యాదవ్‌కు టికెట్ దక్కడంతో బొంతు నారాజ్ అయ్యారని అనుచరులు చెబుతున్నారు.. ఇక 2029 ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ బరిలో ఉండాలని బొంతు రామ్మోహన్ బలంగా కోరుకుంటున్నారట. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లో బొంతు రామ్మెహన్‌కు టికెట్ దక్కే అవకాశాలు దాదాపు లేనట్టేనని చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో.. ఆశావాహులు భారీగానే ఉన్నారు. ముఖ్యంగా ఉప్పల్ లో పరమేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌లో మెంబర్. వచ్చే ఎన్నికల్లోనూ పరమేశ్వర్ రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
దాంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు లేవనే ఉద్దేశంతోనే బొంతు రామ్మోహన్ పార్టీ మారేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగుతోంది. మరోవైపు తన భార్య బొంతు శ్రీదేవికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకునే పనిలో బొంతు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బొంతు రామ్మోహన్.. తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఏ పదవి దక్కడం లేదని, అటు మంత్రులు, ఎమ్మెల్యేలు తనను పట్టించుకోవడం లేదని వాపోతున్నారట. అందుకే ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బొంతు రామ్మోహన్‌కు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే టికెట్ హామీ లేకపోవడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భేతీ సుభాష్ రెడ్డికి టికెట్ ఇవ్వని కేసీఆర్ బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంతో.. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ బండారు లక్ష్మారెడ్డికే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఉప్పల్ టికెట్ దక్కే అవకాశాలు లేవని తేలడంతో.. కారు ఎక్కేందుకు వెనకాడుతున్నట్టు అనుచరులు చెబుతున్నారు.
మరోవైపు కేసీఆర్ తనయ.. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితకు కూడా బొంతు రామ్మోహన్ అత్యంత ఆప్తుడు. ఒకవేళ కవిత పార్టీలో చేరితే.. టికెట్ హామీ ఉంటుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. ఇదే సమయంలో తన భార్య బొంతు శ్రీదేవికి సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం బొంతు రామ్మోహన్ లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. బొంతు శ్రీదేవి గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. గ్రేటర్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పుట్టి పెరిగింది అంతా కూడా అమీర్ పేటలో కావడంతో.. వచ్చే ఎన్నికల్లో సనత్ నగర్ టికెట్ ను శ్రీదేవి కోసం అడుగుతున్నట్టు తెలుస్తోంది. అటు పార్టీలో చేరితే రెండు టికెట్లపై కవిత కూడా హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఏదీఏమైనా మున్నురుకాపు సామాజికవర్గంలో కీలకంగా ఉన్న బొంతు రామ్మోహన్ పార్టీ మారితే.. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ లో కష్టమేనన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే..మున్నురుకాపుల్లో ఓ వర్గం బొంతు వెంట నడిచే అవకాశాలు ఉంటాయి. దాంతో ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీపైన కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బొంతు రామ్మోహన్ ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపులతో బొంతు రామ్మోహన్ వెనక్కి తగ్గుతారా.. లేక.. తెలంగాణ రక్షణ సేనలో చేరుతారా అనేది మాత్రం త్వరలోనే తేలనుంది.