
గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు.
ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
BRS Politics: బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉండగానే.. గులాబీ లీడర్లు యాక్టివ్ అయ్యారు. పార్టీని మరోసారి అధికారం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలతో క్యాడర్లో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదే సమయంలో నేతల మధ్య సీట్ల పంచాయితీ అధినేతకు ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే సీట్ల కోసం నేతలు ఇప్పటినుంచే ఖర్చీప్ వేస్తూ.. పార్టీ హైకమాండ్ ను ఇరకాటంలోకి నెడుతున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మాజీమంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ చేసిన కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.. గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గంలో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ అడ్డా.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. 2014 లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ గౌడ్.. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఎన్నికల తర్వాత.. ప్రకాశ్ గౌడ్ అధికార పార్టీలో చేరిపోయారు. దాంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొద్ది రోజులుగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ రాజేంద్ర నగర్ లో తొలి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న స్వామిగౌడ్ రాకతో కార్తీక్ రెడ్డికి టికెట్ వస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అంతేకాదు.. బీఆర్ఎస్ నేతల విస్త్రత స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ ఎదుటే స్వామిగౌడ్ పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు కేతెలంగాణ ఉద్యమ కారులు కింద కూర్చుంటే.. ఉద్యమ ద్రోహులు స్టేజిపైన ఉన్నారనే కోణంలో ఆయన చెప్పడంతో.. కార్తీక్ రెడ్డినే ఉద్దేశించి మాట్లాడారని పార్టీలో చర్చ జరుగుతోందట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన స్వామిగౌడ్‌కు అప్పటి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత శాసనమండలి చైర్మన్‌గానూ పదోన్నతి కల్పించారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం పూర్తయ్యాక.. రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేయాలని స్వామిగౌడ్ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం.. ప్రకాశ్ గౌడ్‌ను వదులుకునే పరిస్థితి లేకపోవడంతో.. స్వామిగౌడ్‌కు అవకాశం ఇవ్వలేదు. దాంతో అలకబూనిన స్వామిగౌడ్.. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు.. కానీ ఆ పార్టీలో ఎక్కువరోజులు గడవకముందే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేసే ఆలోచనలో స్వామి గౌడ్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలోనే స్వామిగౌడ్ టికెట్ రేసులో తాను ఉన్నానని చెప్పకనే చెప్పారనే చర్చ జరుగుతోంది. అటు స్వామి గౌడ్ కామెంట్స్ పైన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వర్గం కూడా గుర్రుగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనే స్వామిగౌడ్ కామెంట్లపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ఆ కోవర్టులు ఎవరని గులాబీ హైకమాండ్ ఆరా తీస్తోందట. స్వామిగౌడ్ చెప్పినట్టుగా నిజంగానే రేవంత్ కోవర్టులు పార్టీలో చేరారా.. చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా అని ఎంక్వైరీ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తంమీద ఎన్నికలకు రెండున్నరేళ్లు ముందుగానే స్వామిగౌడ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీలో టికెట్ లొల్లి మొదలైంది. రాజేంద్ర నగర్ లో యాక్టివ్‌గా ఉన్న కార్తీక్ రెడ్డికి పోటీగా స్వామి గౌడ్ రంగంలోకి దిగడంతో.. టికెట్ ఎవరికి ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అటు పార్టీలో కోవర్టులు ఎవరనే దానిపై నేతలు తెగ చర్చించుకుంటున్నట్టు సమాచారం..