
మార్కెట్ నుంచి తేగానే టొమాటోలను వెంటనే ఫ్రిజ్లో పెట్టేస్తారు చాలామంది. కానీ పచ్చిగా లేదా పూర్తిగా పండని టొమాటోలను ఫ్రిజ్లో పెడితే వాటి సహజమైన రుచి, వాసన పోతాయి.
బాగా పండిన టొమాటోలను మాత్రమే ఫ్రిజ్లో పెట్టండి. పచ్చి టొమాటోలను బయటే ఉంచితే అవి పండేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అవి ఎక్కువ కాలం పాటూ అలా తాజాగా ఉంటాయి.
టోమాటోలు తాజాగా ఉంచేందుకు ఇది ముఖ్యమైన చిట్కా. టొమాటోలను నిల్వ చేసేటప్పుడు, వాటి తొడిమ (Stem) ఉన్న భాగాన్ని కిందకు పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల టొమాటోలోని తేమ ఆవిరైపోకుండా ఉంటుంది. బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా కూడా ఇది అడ్డుకుంటుంది. దీంతో టొమాటోలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
టొమాటోలకు ఎక్కువ సూర్యరశ్మి తగలనివ్వకూడదు. కిటికీ దగ్గర లేదా నేరుగా ఎండ తగిలే చోట పెట్టొద్దు. అధిక వేడికి అవి త్వరగా పండిపోయి, కుళ్లిపోవడం మొదలవుతుంది. ఎప్పుడూ చల్లగా, నీడగా ఉండే ప్రదేశంలోనే వాటిని ఉంచడం ఉత్తమం.
యాపిల్స్ లేదా అరటిపండ్ల వంటి పండ్లతో పాటు టొమాటోలను కలిపి పెట్టకూడదు. ఎందుకంటే, ఈ పండ్ల నుంచి ఇథిలీన్ (Ethylene) అనే గ్యాస్ విడుదలవుతుంది. ఇది టొమాటోలు చాలా వేగంగా పండేలా చేస్తుంది. దీనివల్ల అవి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.
టొమాటోలు కొంచెం పచ్చిగా ఉండి, త్వరగా పండాలి అనుకుంటే వాటిని ఒక పేపర్ బ్యాగ్లో వేసి ఉంచండి. అయితే, అవి పూర్తిగా పండిన తర్వాత వెంటనే పేపర్ బ్యాగ్ నుంచి తీసి బయట పెట్టండి. లేదంటే, వాటిలో తేమ పెరిగిపోయి కుళ్లిపోయే అవకాశం ఉంది.