
SK Hynix | ఇంటర్నెట్ డెస్క్: శాంసంగ్.. ప్రపంచంలో ఈ పేరు పరిచయం లేనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీ.
ఎలక్ట్రానిక్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ గడిచిన 25 ఏళ్లుగా మార్కెట్ విలువపరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీన్ని అధిగమించడం అసాధ్యమనుకున్నారంతా. కానీ దాన్ని ఓ కంపెనీ సవాల్‌గా తీసుకుంది. రెండు దశాబ్దాల క్రితం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ కంపెనీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఏఐ బూమ్‌ను అందిపుచ్చుకుని శాంసంగ్ ఆధిపత్యానికి చెక్ పెట్టింది. అదే దక్షిణకొరియాకు చెందిన మెమొరీ చిప్స్ తయారీ సంస్థ ఎస్కే హైనిక్స్ (SK Hynix).
సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్లో ఎస్కే హైనిక్స్ షేరు విలువ 5.7 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 2082.5 ట్రిలియన్ వాన్ల (1.35 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. అదే సమయంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ విలువ 2081.3 ట్రిలియన్ వాన్‌లుగా ఉంది. ఈ శతాబ్దం ఆరంభం (2000వ సంవత్సరం) నుంచి దక్షిణ కొరియాలో అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా శాంసంగ్ కొనసాగుతోంది. దాన్ని ఎస్కే హైనిక్స్ తాజాగా అధిగమించింది. అయితే, తమ ప్రిఫర్డ్ షేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే కంపెనీ మొత్తం మార్కెట్ విలువ దాదాపు 2,252 ట్రిలియన్ వాన్‌లుగా ఉంటుందని శాంసంగ్ పేర్కొంటోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిస్టమ్స్‌లో కీలకమైన హై-బ్యాండ్‌విడ్త్ మెమొరీ (HBM) చిప్స్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది ఎస్కే హైనిక్స్ రాణించడానికి కారణమైంది. ఎన్విడియా, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలకు మెమొరీ చిప్స్‌ను ఎస్కే హైనిక్స్ సరఫరా చేస్తుంటుంది. 2025లో అంతర్జాతీయంగా హెచ్‌బీఎం మార్కెట్లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 61 శాతంగా ఉంది. ఈ రంగంలో శాంసంగ్‌కు 17 శాతం, మైక్రాన్‌కు 21 శాతం వాటా ఉంది.
1983లో హ్యుందాయ్ గ్రూప్ ఎస్కే హైనిక్స్ను నెలకొల్పింది. రెండు దశాబ్దాల క్రితం, అంటే 2002-2003లో మధ్య ఈ కంపెనీ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది. భారీ విస్తరణ ప్రణాళికలు, అదే సమయంలో DRAM ధరలు భారీగా కుంగిపోవడంతో కంపెనీ పరిస్థితి దిగజారింది. దీంతో అమెరికాకు చెందిన ప్రత్యర్థి కంపెనీ మైక్రాన్ టెక్నాలజీకి దీన్ని విక్రయించేందుకు ఒప్పందం కూడా కుదిరింది. అయితే, చివరి నిమిషంలో ఆ డీల్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత కంపెనీ కొన్నాళ్ల పాటు క్రెడిటర్ల చేతికి వెళ్లింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా 2003లో హ్యుందాయ్ గ్రూప్ యాజమాన్య బాధ్యతల నుంచి వైదొలిగింది. ఓ విధంగా చెప్పాలంటే వదిలించుకుంది. అలాంటి కంపెనీ.. ఇప్పుడు ఏఐ బూమ్ కారణంగా ఫీనిక్స్ పక్షిలా ఈ స్థాయికి చేరడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.