పాకిస్థాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భారత్‌లో చార్రితక ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేస్తున్నారంటూ పాక్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు.
అసీఫ్ అలీ జర్దారి చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ ఉద్దేశపూర్వక రాజకీయ దాడికి దిగుతోందని విదేశాంగ విభాగం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పాక్ అధ్యక్షుడు జర్దారీ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టులో.. భారత్‌లో చారిత్రక ముస్లిం మతపరమైన స్థలాలను కూల్చివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారణాసిలోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన మసీదు గంజ్ షహీదాపై ఉన్న ముప్పును ప్రస్తావిస్తూ ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. మైనార్టీ హక్కులు, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలని భారత్‌కు ఆయన సూచించారు. జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలను భారత్ పూర్తిగా ఖండిస్తోందన్నారు. భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు పాకిస్థాన్ అధ్యక్షుడికి లేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇఛ్చారు. మానవ హక్కుల పరిరక్షణ విషయంలో పాకిస్థాన్ ప్రపంచం ముందు విమర్శలకు గురవుతోందని ఈ సందర్భంగా జైస్వాల్ గుర్తు చేశారు. మైనార్టీలను పాకిస్థాన్ కొన్ని దశాబ్దాలుగా ప్రణాళిక ప్రకారం వివక్ష, వేధింపులకు గురి చేస్తోందన్నారు. ప్రపంచానికి ఈ విషయం తెలుసుని గుర్తు చేశారు. పాకిస్థాన్ జాతీయ విధానాల్లో ఉన్న మత అసహనం, ద్వేష భావజాలం కారణంగానే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయంటూ జైస్వాల్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జర్దారీ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే చేసి దాడిగానే చూడాలని భారత్ స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా పాక్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో దాయాది దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైనట్లు అనిపిస్తోంది.