
రాజమహేంద్రవరం (ఏవీఏ రోడ్డు, కంబాలచెరువు), రాజానగరం: రాజమహేంద్రవరం రోడ్ కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి గల్లంతైన కాకినాడకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ వంశీ మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ(31) కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్లో కానిస్టేబుల్. ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయనకు పెళ్లి సంబంధం చూసి... నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఓ మహిళా కానిస్టేబుల్ రాజమహేంద్రవరం మహిళా పోలీసుస్టేషన్లో వంశీపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు పలుమార్లు వంశీని పిలిపించి విచారించారు. తాజాగా గురువారం కూడా మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించారు. అదేరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వంశీ బయటకు వెళ్లి తన తండ్రికి ఫోన్ చేసి, గోదావరిలోకి దూకారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు వంతెనపై ద్విచక్రవాహనం, చెప్పులు గుర్తించారు. శుక్రవారం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలించాయి. రాత్రి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. ‘ఇటీవల నా కుమారుడు వంశీకి పెళ్లి సంబంధం కుదిరింది. అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లి చేసుకోవాలని వంశీని వేధిస్తున్నారు. ఆమెనే వివాహం చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగం పోతుందని పోలీసులూ ఒత్తిడి చేశారు. దీంతోనే వంశీ గోదావరిలో దూకాడ’ని వంశీ తండ్రి వీర వెంకట్రావు తెలిపారు. నిన్నటి నుంచి నదిలో గాలింపు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇవాళ ఉదయం మృతదేహాన్ని వెలికి తీశాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.