
ఏఐ సేవలు పొందాలంటే ప్లాన్ తీసుకోక తప్పని పరిస్థితి గతంలో వందల పేజీల పుస్తకాన్ని పీడీఎఫ్ రూపంలో ఇస్తే ఉచితంగా తర్జుమా చేసిన కృత్రిమమేథ(ఏఐ) వెబ్సైట్లు.. ఇప్పుడు అయిదు పది పేజీలకే పరిమితం అయ్యాయి. పూర్తిగా కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోమంటున్నాయి.
ఏదైనా వీడియో, ఆడియో ఇచ్చి మాటల రూపంలో ఇవ్వమంటే సైజు ఎక్కువైందని, అప్గ్రేడ్ చేసుకోమంటున్నాయి.. ఇతర అవసరాలపైనా ఇలాంటి పరిమితులే! ఇటీవలి వరకు ఉచితంగా ఏఐ సేవలు వినియోగించున్న వారంతా ఇప్పుడు అవే సేవలు కావాలంటే ప్లాన్ తీసుకోక తప్పదు.
వినియోగానికి అలవాటు పడిన మనసు ప్లాన్ తీసుకోమంటోంది. బిల్లు చూస్తే గుండె గుభేల్మంటోంది. కనిష్ఠంగా రూ.399 నుంచి మొదలు పెడితే మీ ఓపికను బట్టి రూ.వేలల్లో ఉంటుంది. సాధారణ అవసరాలకు ఏఐ వినియోగించుకోవాలంటే నెలకు రూ.399 నుంచి ప్లాన్లు మొదలవుతున్నాయి.
అపరిమిత వినియోగానికి ఇందులో వీలుండదు. ప్లాన్ తీసుకునే సమయంలో వివరాలు తెలుసుకోవడం మంచిది. కొన్ని సంస్థలు కొన్ని రోజులు సేవల్ని ఉచితంగా ఇస్తామంటూనే.. బ్యాంకు కార్డుల వివరాలు అప్లోడ్ చేయంటున్నాయి. అంటే ఉచితం అయిపోగానే కార్డులో కట్ చేస్తారు.
ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి అయితే.. తొలుత దాని ద్వారా ఎంతమేర వినియోగించుకోవచ్చో స్పష్టంగా తెలుసుకోండి. ఏఐ టూల్స్ ఉచిత వినియోగానికి పరిమితులు వచ్చేశాయి. రోజుకు కొన్ని సందేశాలు, కొంత సమయమే అని నిర్దేశిస్తున్నాయి. మరికొన్ని రద్దీ ఎక్కువగా ఉందని..
తర్వాత ప్రయత్నించండని విండో మూసేస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా చందా కడితేనే ఏఐ సేవలు అందే వీలుంది. వివిధ రకాల వృత్తి నిపుణులు తమ అవసరాలకు ఏఐని వినియోగిస్తే.. అందుకు ప్రత్యేక ప్లాన్లు తీసుకోవాలి. విద్యార్థులైనా, ఉపాధ్యాయులైనా, అధ్యాపకులైనా, శాస్త్రవేత్తలైనా..
ఇలా ఎవరైనా సరే ఒకప్పుడు ఏదైనా అంశంపై సమాచారం కావాలంటే గూగుల్లో వెదికేవాళ్లు.. ఇప్పుడు ఏది కావాలన్నా ఏఐ సైట్స్లోకే వెళ్తున్నారు. అది సమస్త సమాచారాన్ని క్రోడీకరించి ఇట్టే ఇచ్చేస్తోంది. అందులోనూ ఎన్నో సంస్థలు, మరెన్నో మోడల్స్, టూల్స్ వచ్చేశాయి
. మీ కంప్యూటర్, మొబైల్లోని సమాచారాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగత సహాయకునిలా కార్యక్రమాలను షెడ్యూల్ చేస్తున్నాయి. ఏ రోజు ఏ పనిచేయాలో కూడా గుర్తు చేస్తాయి.
గతంలో ఫొటోకు మెరుగులు దిద్దాలంటే ఫొటోషాప్, ఇతర టూల్స్ వాడేవారు. ఇప్పుడంతా ఏఐలోకి వచ్చేసింది. ఎలా కావాలో చెబితే క్షణాల్లో అలా తయారుచేసి ఇచ్చేస్తోంది. సమాచారం ఇస్తే వీడియోలు చేసి, టైటిల్స్ పెట్టేస్తుంది. మనుషుల్ని సృష్టించి వారితోనే మాట్లాడిస్తుంది. పీపీటీ, పీడీఎఫ్, వర్డ్, ఎక్సెల్ ఇలా ఒకటేమిటి అన్ని పనులు చేస్తోంది.
ఒకప్పుడు ఆంగ్లంలో పదాలు ఇచ్చి తెలుగులో అర్థం చెప్పమంటే దురర్థాలు ధ్వనించేవి. ఇప్పుడు ఏఐ పక్కాగా తర్జుమా చేసి సాధారణ ప్రజలు మాట్లాడుకునే భాషలో అందిస్తోంది. రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర సహా మీరు కోరిన మాండలికంతోపాటు గ్రాంథికంలోనూ ఇచ్చేస్తోంది.
కాస్తో కూస్తో సాంకేతికతపై అనుభవం ఉన్న వారు ఏఐ ఉపయోగించి తమకు కావాల్సిన విధంగా యాప్లు కూడా తయారు చేస్తున్నారు.. ఇలా ఒక్కటేమిటి అనేకానేక పనులకు ఏఐపై ఆధారపడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.