
బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతల వైఖరిని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఎండగట్టారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు
.
హైదరాబాద్, జూన్ 08: బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతల వైఖరిని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఎండగట్టారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ మీడియా హాల్లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామంటారు.. మూసీ అభివృద్ధి వద్దంటారని పేర్కొన్నారు. అసలు ఇలాంటి ప్రతిపక్షాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. మీ భవిష్యత్తు మీకు అర్థమవుతుందా? అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లకు సూటిగా ప్రశ్నించారు. అబద్ధాలు ప్రచారం చేసే వారికి గరుడ పురాణంలో శిక్ష ఖరారు చేస్తారన్నారు. హరీశ్ రావు శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నారు. హెడ్ లైన్ కోసం హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
150 మీటర్లకు తుమ్మిడిహెట్టి నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర గవర్నర్‌గా తెలంగాణకు చెందిన బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు ఉన్నారని గుర్తు చేశారు. ఆయన్ని కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో 600 ఎంజీడీ వాటర్ సప్లై హైదరాబాద్ మహానగరానికి ఉందన్నారు.
పదేళ్ళలో ఒక్క ఎంజీడీ వాటర్ కూడా హైదరాబాద్‌కు బీఆర్ఎస్ తీసుకు రాలేదని చెప్పారు. పాలమూరు - రంగారెడ్డి కెనాల్ నిర్మాణం చేయకుండా 90 శాతం పనులు పూర్తయ్యాయని బిఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. డీపీఆర్‌లో సగం బడ్జెట్ కూడా ఖర్చు పెట్టకుండా 90 శాతం పనులు చేయడం సాధ్యమా? అంటూ తెలంగాణ ప్రభుత్వ వీప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.
భూబకాసురల విషయంలో హైడ్రా.. హిట్లర్ అని ఆయన అభివర్ణించారు. హిట్లర్ కంటే కఠినంగా ఉంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించినప్పుడు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆ పార్టీ నేతలను సూటిగా ప్రశ్నించారు. నాడు కేసీఆర్ మాట్లాడిన మాటలనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడని స్పష్టం చేశారు. అందులో తప్పేముందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధిస్తున్న బీఆర్ఎస్ నేతలకు యెన్నం శ్రీనివాస్ రెడ్డి చురకలంటించారు.
20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: టీజీ భరత్
ఆగస్ట్ 15 నాటికి సంజీవని పథకం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు