
Samantha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కొత్త సినిమా మా ఇంటి బంగారం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, భర్త రాజ్ నిడిమోరు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పెళ్లి తర్వాత జీవితంలో వచ్చిన మార్పులు, కుటుంబం గురించి తన ఆలోచనలను అభిమానులతో షేర్ చేశారు. సమంత 2025లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట తరచూ సోషల్ మీడియాలో తమ అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత, తన జీవితంలో భర్త పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పారు."నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం వేర్వేరు. కానీ ప్రతి నిర్ణయం మాత్రం కలిసి తీసుకుంటాం. చిన్న విషయం అయినా, పెద్ద విషయం అయినా రాజ్‌తో మాట్లాడకుండా ముందుకు వెళ్లను" అని సమంత తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో లేదా పోస్ట్ పెట్టే ముందు కూడా రాజ్ అభిప్రాయం తెలుసుకుంటానని చెప్పారు. రాజ్‌కు విషయాలను చాలా సూటిగా, నిజాయితీగా చూసే దృష్టి ఉందని సమంత పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో ఉండటం వల్ల కొన్నిసార్లు మనం వాస్తవాలకు దూరమవుతామని, అలాంటి సమయంలో రాజ్ తనకు సరైన సలహాలు ఇస్తారని చెప్పారు.
"నేను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆయనతో చర్చిస్తాను. 99 శాతం సందర్భాల్లో ఆయన చెప్పిన మాటనే వింటాను" అని సమంత వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో ఆమె మహిళలపై సమాజం పెట్టే అంచనాల గురించి కూడా మాట్లాడారు. మా ఇంటి బంగారం సినిమాలో ఒక మహిళ తన అత్తింటివారిని మెప్పించడానికి చేసే ప్రయత్నాల కథను చూపిస్తున్నారని చెప్పారు.
ఈ సినిమా 1980ల నేపథ్యంలో సాగినా, అందులో చూపించిన సమస్యలు ఇప్పటికీ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. "ఈ రోజుల్లో కూడా మహిళల కోసం ఒక చెక్‌లిస్ట్ ఉంటుంది. బాగా వంట చేయాలి, పాటలు పాడాలి
, ఇంటిని చూసుకోవాలి, కుటుంబాన్ని కలిపి ఉంచాలి అనే అంచనాలు ఉంటాయి. అవన్నీ చేయలేకపోతే మహిళగా తక్కువగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది" అని సమంత అన్నారు.
అయితే తాను ఆ చెక్‌లిస్ట్‌లో చాలా విషయాలు పూర్తి చేయలేనని సరదాగా చెప్పారు. "నాకు వంట రాదు. నేను పాటలు కూడా పాడలేను. మరి అలాంటి వాళ్లు ఇంట్లో బంగారం కాదా?" అని ప్రశ్నించారు. ప్రతి మహిళకు తనదైన ప్రత్యేకత ఉంటుందని, సమాజం చెప్పిన ప్రమాణాలతో కాకుండా ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి అంగీకరించాలని అభిప్రాయపడ్డారు.మా ఇంటి బంగారం చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. గతంలో వచ్చిన ఓ బేబీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.