జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. శుక్రవారం
జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం పవన్ కల్యాణ్ లింగమనేని రమేష్ పేరును ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. లింగమనేని రమేష్‌కు జనసేన పార్టీతో, పవన్ కళ్యాణ్‌తో 2015 నుంచి అనుబంధం ఉందని తెలిపింది. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులై ఆయన వెన్నంటి ఉన్నారని తెలిపింది. రాజ్యసభ అభ్యర్థిగా శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారని ప్రకటించింది. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ, జనసేన సిద్ధాంతాలపైనా, పవన్ కళ్యాణ్‌పైనా విశ్వాసంతో ఎన్ని ఒత్తిళ్ళు, సవాళ్ళు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలు పరిగణనలోకి తీసుకోకుండా అవకాశం కల్పించినట్లు జనసేన తెలిపింది. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కళ్యాణ్ పరిగణనలోకి తీసుకున్నారని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరుతో ప్రకటన విడుదలైంది.మరోవైపు వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సానా సతీష్ బాబు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ నలుగురి పదవీకాలం పూర్తి కావొస్తూ ఉండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీ మూడు, జనసేన పార్టీ ఒక సీటు తీసుకున్నాయి. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ఖరారు కాగా.. టీడీపీ నుంచి ఆ ముగ్గురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ గడువు జూన్ 8వ తేదీతో ముగుస్తుంది. ఈలోపు.. అంటే శని, ఆదివారాలలో టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. టీడీపీ నుంచి పలువురు సీనియర్ నేతలు రాజ్యసభ స్థానం కోసం పోటీపడుతున్నారు. వర్ల రామయ్య, యనమల, దేవినేని ఉమామహేశ్వరరావు, భాష్యం రామకృష్ణ, కంభంపాటి రామ్మోహన్ రావు వంటి సీనియర్లతో పాటుగా గల్లా జయదేవ్, చింతకాయల విజయ్, సానా సతీష్, రాజేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఎవరివైపు మొగ్గుతారనేదీ రెండు రోజుల్లో తేలనుంది.