శ్రీవారి భక్తుల కోసం టీటీడీ శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని శుక్రవారం
శ్రీవారి భక్తుల కోసం టీటీడీ శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను ప్రారంభించారు. శ్రీవారి భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతోనే ఈ శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.ఈ దశలో వైద్య నిపుణుల అభిప్రాయాలు సేకరించి.. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విద్య, వైద్యం, ఐటీ రంగాల్లో సేవా భావంతో ముందుకొచ్చే నిపుణులకు తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా నిలుస్తుందన్నారు టీటీడీ ఈవో రవిచంద్ర. ఇందులో భాగంగా టీటీడీ విద్యాసంస్థలు, ఆసుపత్రులలో సేవలు అందించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. వారికి కావాల్సిన వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. రాబోయే రోజులలో శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని మరింత విస్తృతపరిచి.. ఎక్కువ మంది నిపుణుల సేవలు వినియోగించుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు. ప్రత్యేక ఐటీ అప్లికేషన్ ద్వారా శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలంగా ఉండే రోజులలో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుని సేవలందించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో వివరించారు. ఇక శ్రీవారి వైద్య సేవ కార్యక్రమం కింద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు మూడు రోజులు, ఎంబీబీఎస్ వైద్యులకు వారం రోజులు స్వచ్ఛందంగా సేవ చేసేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. వీరికి తిరుపతి, తిరుమలలో భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది. శ్రీవారి వైద్య సేవ కింద స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చే వైద్య నిపుణులు టీటీడీ ఆధ్వర్యంలోని అశ్విని ఆసుపత్రి, స్విమ్స్ ఆస్పత్రి, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వీ గోశాల వంటి చోట్ల తమ సేవలు అందించాల్సి ఉంటుంది. శ్రీవారి వైద్య సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్న వైద్య నిపుణులు టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో తమ స్లాట్‌ను బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.