
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానం కోసం మంజీరా నదిలోకి దిగిన ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానం కోసం మంజీరా నదిలోకి దిగిన ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో మంగళ్ కిష్టాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం మంగళ్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన అనిత (40), ఆమె కుమార్తెలు పావని (14), శివాని (13), అలాగే భాను ప్రసాద్ శుక్రవారం బాన్సువాడ మండలం బుడిమి శివారులోని ఎల్లమ్మ తల్లి ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమీపంలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో పుణ్యస్నానం చేసేందుకు దిగారు.అయితే నదిలో నీటి లోతు ఎక్కువగా ఉండటంతో పాటు ప్రవాహం కూడా బలంగా ఉండటంతో నలుగురూ ఒక్కసారిగా అదుపుతప్పి లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోయారు. నీటిలో మునిగిపోతూ సహాయం కోసం కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించారు. కొందరు యువకులు ప్రాణాలకు తెగించి నదిలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భాను ప్రసాద్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు.అనిత, ఆమె ఇద్దరు కుమార్తెలు అప్పటికే నీటిలో మునిగిపోవడంతో వారిని కాపాడలేకపోయారు. స్థానికులు, ఈతగాళ్లు గంటల తరబడి గాలింపు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు చిన్నారులు, వారి తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.గ్రామంలో ప్రతి ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారులతో కలిసి నవ్వుతూ కనిపించిన కుటుంబం క్షణాల్లో ఇలాంటి దుర్ఘటనకు గురికావడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నదిలో లోతైన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, భక్తులు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా మంజీరా నదిలో నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో లోతు అంచనా వేయడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ విషాద ఘటనతో మంగళ్ కిష్టాపూర్ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి, ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన ఆ కుటుంబం తీరని విషాదంలో మగ్గిపోతోంది.