
యూనైటెడ్ కింగ్డమ్ లో గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న అండర్‌గ్రౌండ్ నేర సామ్రాజ్యం, వ్యవస్థాగత వైఫల్యాల గురించిన నమ్మలేని నిజాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బ్రిటన్‌లోని వివిధ
యూనైటెడ్ కింగ్డమ్ లో గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న అండర్‌గ్రౌండ్ నేర సామ్రాజ్యం, వ్యవస్థాగత వైఫల్యాల గురించిన నమ్మలేని నిజాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బ్రిటన్‌లోని వివిధ పారిశ్రామిక పట్టణాలలో పాకిస్తానీ, ఆసియా మూలాలు కలిగిన ముఠాలు మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని సాగించిన లైంగిక అరాచకాలు, దానికి ప్రభుత్వ రక్షణ విభాగాలు వహించిన మౌనం ఇప్పుడు ఆ దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది. బాధితులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమాజంలో జాత్యహంకారులు అనే ముద్ర పడుతుందనే భయంతో పోలీసులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ ఘోరాలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వర్గానికి చెందిన నేరస్థులను కాపాడే క్రమంలో వేలాది మంది అమాయక బాలికల జీవితాలు బుగ్గిపాలయ్యాయి.
ఈ దారుణాల మూలాలు నిన్న మొన్నటివి కావు, దాదాపు 1960ల నాటి నుండి బ్రిటన్ వలస విధానాల కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి వచ్చిన వలసదారులు ఉత్తర ఇంగ్లాండ్, మిడ్‌ల్యాండ్స్ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ముఖ్యంగా రోదర్హామ్, రాచ్డేల్, డర్బీ, బ్రాడ్ఫర్డ్, టెల్ఫర్డ్ వంటి పట్టణాలలో 80వ దశకం నుండే ముస్లిం నేపథ్యం ఉన్న పాకిస్తానీ పురుషుల ముఠాలు చిన్న పిల్లలను ట్రాప్ చేయడం (గ్రూమింగ్) ప్రారంభించాయి. స్థానిక నివాసితులు, బాధితుల తల్లులు దశాబ్దాల పాటు ఈ విషయాలపై గళమెత్తినప్పటికీ, జాతి సంబంధాలు దెబ్బతింటాయనే నెపంతో బ్రిటన్ అధికార యంత్రాంగం కళ్లు మూసుకుంది. పైగా, సహాయం కోసం వచ్చిన బాలికలనే తప్పుగా చిత్రీకరిస్తూ వారి ఫిర్యాదులను తిరస్కరించడం గమనార్హం.
ఈ నేరాల తీవ్రత కాలక్రమేణా మారుతూ వచ్చి, 20వ దశకం తర్వాత ఒక్కొక్కటిగా బయటపడటం ప్రారంభమైంది. 2001 నుండి 2004 మధ్యకాలంలో రోదర్హామ్ కేర్ హోమ్‌ల నుండి చిన్న పిల్లలను కొందరు టాక్సీ డ్రైవర్లు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆధారాలు లభించినా.. స్థానిక కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే క్రమంలో శ్వేతజాతి బాలికలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దారుణాలపై ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ రూపొందించిన డాక్యుమెంటరీని సైతం సామాజిక ఉద్రిక్తతలు వస్తాయనే భయంతో నిలిపివేశారు. అయితే, 2010లో డెర్బీషైర్‌లో 11 మంది పాకిస్తానీ మూలాల వ్యక్తులకు చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ (సీఎస్ఈస్) కేసులో శిక్ష పడటంతో ఈ దారుణాలు మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చాయి. ఆ తర్వాత 2012లో రాచ్డేల్లో 13 ఏళ్ల చిన్నారిపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడిన తొమ్మిది మంది ముఠా సభ్యులకు కోర్టు కఠిన శిక్షలు విధించింది.
ఈ దశాబ్దాల చీకటి కోణాన్ని పూర్తిగా వెలుగులోకి తెచ్చింది మాత్రం 2014లో ప్రచురితమైన జే నివేదిక.. ప్రొఫెసర్ అలెక్సిస్ జే నేతృత్వంలో సాగిన స్వతంత్ర దర్యాప్తులో రోదర్హామ్ అనే ఒక్క పట్టణంలోనే 1997-2013 మధ్య కాలంలో కనీసం 1400మంది పిల్లలు దారుణమైన లైంగిక దోపిడీకి, హింసకు గురైనట్లు తేలింది. 11 ఏళ్ల చిన్నారిని అపహరించి, మత్తుమందులు ఇచ్చి ఇతర ప్రాంతాలకు రవాణా చేసినట్లు ఈ నివేదిక బహిర్గతం చేసింది. ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, నిందితుల జాతి, మతపరమైన వివరాలను నివేదికలలో చేర్చవద్దని కౌన్సిల్ ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయి. నిజమైన నేరాలను అరికట్టడం కంటే పొలిటికల్ కరెక్ట్ నెస్ పాటించడమే ముఖ్యం అన్నట్లుగా అధికారులు ప్రవర్తించారు.
న్యాయపరమైన చర్యల విషయానికి వస్తే.. ఈ కేసులలో నిందితులకు కోర్టులు తీవ్రమైన శిక్షలు ఖరారు చేశాయి. రాచ్డేల్ ముఠా నాయకుడు షబీర్ అహ్మద్‌కు 22 ఏళ్లు, రోదర్హామ్ గ్యాంగ్ సభ్యుడు అర్షిద్ హుస్సేన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. కోర్టు విచారణల సమయంలో నిందితులు ప్రదర్శించిన నిర్లజ్జత న్యాయమూర్తులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రమంలోనే, బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ బ్రిటన్ పౌరసత్వం ఉన్న నిందితుల పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీనిపై నిందితులు చట్టపరమైన పోరాటాలు చేసినప్పటికీ.. ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అదిల్ ఖాన్, క్వారీ అబ్దుల్ రౌఫ్ వంటి క్రిమినల్స్‌ను పాకిస్తాన్‌కు బహిష్కరిస్తూ యూకే ఉన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
ఈ సమస్య కేవలం కొన్ని పట్టణాలకే పరిమితం కాలేదు. 2017లో న్యూకాజిల్‌లో జరిగిన ‘ఆపరేషన్ శాంక్చ్యురీ’ ద్వారా వందలాది మంది బాధితులను గుర్తించారు. క్విల్లియమ్ ఫౌండేషన్ చేసిన పరిశోధనల ప్రకారం, ఈ గ్రూమింగ్ నేరాలలో దోషులుగా తేలిన వారిలో అత్యధిక శాతం అంటే దాదాపు 84 శాతం మంది ఆసియా మూలాలు, అందునా పాకిస్తానీ నేపథ్యం ఉన్నవారేనని స్పష్టమైంది. అయినప్పటికీ.. దేశంలో రాజకీయ, మీడియా వర్గాలు ఈ సత్యాన్ని అంగీకరించడానికి వెనుకాడాయి. రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో లేదా, లౌకికవాద ముసుగులోనో ఈ సున్నితమైన అంశాన్ని పక్కన పెట్టారనే విమర్శలు తీవ్రమయ్యాయి. 2025లో బారోనెస్ కేసీ సమర్పించిన నివేదిక ప్రకారం, చాలా కేసులలో నిందితుల జాతి గుర్తింపును పోలీసులు అసలు రికార్డు చేయనేలేదని తేలింది.
ఈ పరిణామాలు బ్రిటన్ రాజకీయాలలో పెద్ద సంక్షోభాన్ని సృష్టించాయి. లేబర్ పార్టీ నేతలు ఈ అంశాన్ని జాతీయ విచారణకు తీసుకెళ్లడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, కేసీ ఆడిట్ నివేదిక తర్వాత ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రస్తుతం యూకే ప్రభుత్వం గతంలో మూసివేసిన సుమారు 1200కు పైగా పాత కేసులను పునఃపరిశీలించడానికి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ) ఆధ్వర్యంలో ఆపరేషన్ బీకాన్పోర్ట్ ను ప్రారంభించింది. ఇందుకోసం 65 మిలియన్ పౌండ్ల భారీ బడ్జెట్‌ను కేటాయించి, బారోనెస్ ఆన్ లాంగ్ఫీల్డ్ నేతృత్వంలో మూడేళ్ల కాలపరిమితితో కూడిన ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణ కమిటీని నియమించింది. ఈ విచారణలో నేరస్థుల సామాజిక, మత మరియు సాంస్కృతిక నేపథ్యాలను కూడా నిష్పాక్షికంగా పరిశీలించనున్నారు.
భవిష్యత్తులోనైనా ఇలాంటి వ్యవస్థాగత లోపాలు పునరావృతం కాకుండా ఉండాలని బ్రిటన్ ప్రజలు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా నలిగిపోయిన బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం.. భవిష్యత్తు తరాల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయడం ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది. లౌకికవాదం లేదా జాతి వివక్ష అనే ముసుగులో నేరస్థులను తప్పించే ప్రయత్నాలకు స్వస్తి పలికి, బాధితుల పక్షాన నిలబడటమే నిజమైన ప్రజాస్వామ్యమని బ్రిటన్ సమాజం ఇప్పుడు గుర్తిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ జాతీయ విచారణ కమిటీ నివేదికలు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాయో వేచి చూడాలి.
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణం.. దశాబ్దాలుగా వీడని తాష్కెంట్ రహస్యం
ఆధునిక సమాచార విప్లవానికి బాటలు వేసిన ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడు డాక్టర్ నరేంద్ర సింగ్ కపానీ!
Disclaimer: All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent..