
మహిళా సాధికారత, నెలసరి ఆరోగ్యం, లింగ సమానత్వం.. ఈ పదాలు వినడానికి పెద్దవిగా అనిపించినా, క్షేత్రస్థాయిలో వీటి చుట్టూ అల్లుకున్న అపోహలు ఇప్పటికీ కోట్లాది మంది
భారతీయ మహిళల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.
మహిళా సాధికారత, నెలసరి ఆరోగ్యం, లింగ సమానత్వం.. ఈ పదాలు వినడానికి పెద్దవిగా అనిపించినా, క్షేత్రస్థాయిలో వీటి చుట్టూ అల్లుకున్న అపోహలు ఇప్పటికీ కోట్లాది మంది భారతీయ మహిళల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. అవే దిల్లీకి చెందిన ఆన్య విగ్ని ఆలోచింపజేశాయి. సామాన్య మధ్యతరగతి అమ్మాయిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, నేడు వేలాదిమంది గొంతుకగా మారిన ఆమె ప్రయాణమిది.
దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘హర్ హక్’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆన్య. స్త్రీల వ్యక్తిగత ఆరోగ్యం, లింగ వివక్ష, సాధికారత వంటి అంశాలపై పోరాడుతున్నారు. వాటి గురించి అందరిలోనూ అవగాహనా కల్పిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఏడాది వయసున్నప్పుడే ఆమె తండ్రిని కోల్పోయారు. ‘నాన్న చనిపోయాక బాధ్యత అంతా అమ్మమీదే పడింది. ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తూ... మమ్మల్ని పోషించేది. ఒంటరిగానే పనులన్నీ చక్కబెట్టుకునేది. అలా తనని చూస్తూ పెరగడం వల్లేనేమో చిన్నప్పటి నుంచీ ఆడవాళ్లు ఏ పనులైనా చేయగలరనే నమ్మకంతో ఉండేదాన్ని. కానీ, బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాకే అసలు వ్యత్యాసం తెలిసింది. తండ్రి, తల్లి చేసే పనుల మధ్య స్పష్టమైన విభజన గమనించా. అంతేకాదు, మహిళ ఒకరికి తల్లి, భార్య, సోదరి... మాత్రమే అన్న అభిప్రాయం, ఆడవాళ్లను స్వతంత్ర భావాలున్న వ్యక్తులుగా గుర్తించడానికి అంగీకరించలేకపోవడం వంటివి నన్ను ఆలోచింపచేశాయి’ అంటారు ఆన్య.
ఆలోచనలకు పదును: ఉన్నత చదువులకోసం దిల్లీలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరామ్ కాలేజీలో చేరడం ఆన్య జీవితంలో ఒక మలుపు. అక్కడే ఆమెకు సామాజిక స్పృహ పెరిగింది. విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె... మహిళల ఆర్థిక స్వేచ్ఛ, పర్యావరణంపై పని చేసే ‘ఆగాజ్’ అనే సంస్థను ప్రారంభించారు. ఆపై పాఠశాల దశ నుంచి బాలికలు నెలసరి సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారం కోసం 2022లో ‘హర్ హక్’ను రిజిస్టర్డ్ ట్రస్ట్‌గా స్థాపించారు. 21 ఏళ్ల వయసులో ఒక ఎన్జీవోను స్థాపించడం అంత సులభం కాదు. చట్టపరమైన పత్రాలు, మేధో సంపత్తి హక్కులు, వెబ్సైట్ నిర్వహణ ఇలా ప్రతి అడుగులోనూ ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. డిగ్రీ అయ్యాక హ్యూమన్‌రైట్స్, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ అండ్ రెఫ్యూజీ లాస్లో డిప్లొమా ఆపై ఎల్ఎల్బీ చేశారు. ఇంటికే పరిమితమైన మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు.
నెలసరిపై అవగాహన: రుతుక్రమం అనేది మహిళల సమస్య కాదు, సామాజిక ఆరోగ్యానికి సంబంధించింది అని ఆన్య బలంగా నమ్ముతారు. అందుకే, వాలంటీర్ల ద్వారా పాఠశాలలు, మురికివాడలు, ఎన్జీవోలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ చర్చల్లో ఆడపిల్లలే కాదు, అబ్బాయిలు కూడా పాల్గొంటారు. పీరియడ్స్ సమయంలో ఇంట్లో ఉండే మహిళలకు ఎలా సహాయం చేయాలో చెబుతారు. అంటే... టీ చేసి ఇవ్వడం లేదా ప్యాడ్స్ కొని తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులతోనే మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పలు ఎన్జీవోల సహకారంతో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ లీడర్లను, యువ ఎంపీలను ఆహ్వానించి ‘హక్ చర్చ’ పేరుతో ముఖాముఖిలను ఏర్పాటుచేస్తున్నారు. దిల్లీ మెట్రోలో మహిళల భద్రతపై అధ్యయనమూ చేశారు. ప్రస్తుతం ‘హర్ హక్’ను దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలనేది ఆన్య లక్ష్యం. ఇప్పటికే దిల్లీ దాటి హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ పనిచేస్తోంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ అవగాహన కలిగించాలనేది ఆన్య కల.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.