
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్ దివంగత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంతిమయాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఖమేనీతో పాటు మృతి చెందిన కుటుంబసభ్యుల శవపేటికలనూ మద్దతుదారు
ల సందర్శనార్థం రాజధాని నగరం టెహ్రాన్‌లో ఉంచారు. వాటిల్లో ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ శవపేటిక కూడా ఉంది. దానిపక్కనే ఆ చిన్నారి ఫొటో ఫ్రేమ్‌ను ఉంచారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ (USA-Israel) నిర్వహించిన సంయుక్తదాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల అనంతరం వీరి అంతిమసంస్కారాలను నిర్వహిస్తున్నారు. ఇరాన్, ఇరాక్‌లోని ఐదు నగరాల్లో ఏడు రోజులు పాటు ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం ఇరాన్‌లోని మషహద్‌లో ఈనెల 9న ఖననం చేయనున్నారు. ఈ రోజు ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వేలాదిమంది తరలివచ్చారు. వారంతా ప్రతీకారానికి గుర్తుగా ఎర్రజెండాలను పట్టుకొని.. ‘డెత్ ఆఫ్ అమెరికా’ అంటూ నినాదాలు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా.. ఖమేనీతో సన్నిహితంగా పనిచేసిన నాయకులు ఉద్వేగానికి గురయ్యారు. విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ ఆయన్ను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇరాన్‌ను మేం చిత్తుగా ఓడించాం. దాంతో వారు రాజీకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మనం మంచివాళ్లం కాబట్టి.. అంత్యక్రియల కోసం వీకాఫ్ ఇచ్చాం’’ అని సౌత్ డకోటాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.