
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi Debut) అరంగేట్రం ఖాయమేనా? గత మూడు మ్యాచుల నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నది దాని కోసమే.
తాజాగా ఈ 15 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాలో చేసిన పోస్టును చూస్తే మాత్రం డెబ్యూ చేయబోతున్నట్లే అనిపిస్తోంది. మరి అతడు ఏ ఉద్దేశంతో ఆ పోస్టు పెట్టాడో తెలియాలంటే ఇంకాస్త వేచి చూడాల్సిందే. ఇంతకీ అతడు ఏం పోస్టు చేశాడంటే..?
ఇంగ్లాండ్‌తో రెండో టీ20 (India vs England) కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది. ఇవాళ రాత్రి 7 గంటలకు మాంచెస్టర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇందులో ఎవరు గెలుస్తారు? ఎవరు బాగా ఆడతారు? అనే విషయాల కంటే వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతాడా? లేదా? అనేదే ఆసక్తికరమైన అంశం. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ నుంచి ఎప్పుడు అవకాశం ఇస్తారా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ మాత్రం వేచిచూసే ధోరణిలోనే ఉంది. అయితే, ఇవాళ్టి మ్యాచ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్లు వైభవ్ (Vaibhav Sooryavanshi) పరోక్షంగా హింట్ ఇచ్చాడని కొందరు అభిమానులు పేర్కొంటున్నాడు. నేటి మ్యాచ్‌కు ముందు ఈ యువ సెన్సేషన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశాడు. అందులో తన ఫొటోపై ‘కొత్త ఛాప్టర్’ అని క్యాప్షన్ ఇచ్చిన వైభవ్.. దానికి టోర్నడో ఎమోజీని జత చేశాడు. విధ్వంసం సృష్టించడానికి సిద్ధమని ఈ ఎమోజీకి అర్థం. మరి ఇది టీమ్ఇండియాలోకి డెబ్యూ కోసమా? లేకపోతే మరేదైనా యాడ్‌లో నటిస్తున్నాడా? అనే దానిపై క్లారిటీ లేదు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.