తెలంగాణలో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని 19 జిల్లాల రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఎంసీపీ (జాతీయ పత్తి ఉత్పాదకత పథకం) ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు పంపిణీ చేయనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంసీపీ పథకం కింద ప్రతిపాదనలు పంపగా.. పత్తి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచే దిశగా 19 జిల్లాలను విత్తనాల పంపిణీ కోసం ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ కోదండరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్‌రెడ్డిలు అధికారులతో కలిసి పత్తి విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. నేటి నుంచి రాష్ట్రంలోని 19 జిల్లాల్లో విత్తనాలు పంపిణీ ప్రారంభిస్తారు. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఖమ్మం, జనగామ, వరంగల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని రైతు వేదికల్లో విత్తనాలను పంపిణీ చేస్తారు. ఈ మేరకు రైతులు పత్తి విత్తనాల పంపిణీ విషయాన్ని గమనించాలి. రాష్ట్ర విత్తన సరఫరా సంస్థ ద్వారా ఈ 19 జిల్లాలో ఒక్కో రైతుకు గరిష్ఠంగా 2.5 ఎకరాల చొప్పున విత్తనాలు పంపిణీ చేస్తారు. ఈ లెక్కన చూస్తే మొత్తం 1,27,374 ఎకరాలకు సంబంధించి 50,950 మంది రైతులకు 6.33 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలను అందజేయనున్నారు. ఈ పత్తి విత్తనాలకు సంబంధించి.. కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం చొప్పున మొత్తం రూ.57.02 కోట్ల సబ్సిడీని భరిస్తున్నాయి. రైతులకు పత్తి విత్తనాలతో పాటుగా ప్లాంట్ గ్రోత్ నియంత్రకాలు, వేప నూనె వంటి మందులను రాయితీపై రైతులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగాల భర్తీతెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఎస్‌వోసీఏ (సీడ్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ)లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తం 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారుల పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 7 నుంచి ఆగస్టు 12 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్‌లో రాతపరీక్ష ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థుల వయోపరిమితి 18-44 ఏళ్లు ఉండాలని నిర్ణయించారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఐసీఏఆర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్లో డిగ్రీ, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్‌బ్రీడింగ్, అగ్రోనామి, ప్లాంట్ సైకాలజీలో పీజీ అగ్రికల్చర్ చదివి ఉండాలని టీజీపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి.