
ఝార్ఖండ్ కేంద్రంగా 21 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా ప్రధాన నిందితుడి అరెస్ట్ గంజాయితో వచ్చిన కొరియర్ డబ్బాను చూపిస్తున్న కమిషనర్ సజ్జనర్.
చిత్రంలో డీసీపీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్, అదనపు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
ఈనాడు, హైదరాబాద్: తపాలా శాఖ స్పీడ్‌పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలకు గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న సిండికేట్ గుట్టును హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) ఛేదించింది. ఝార్ఖండ్‌లోని గిరిఢీ జిల్లా నిమియాఘాట్లోని అటవీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న ముఠా.. వేల మందికి గంజాయి సరఫరా చేస్తోంది. మొత్తం ఐదుగురితో కూడిన ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు గంజాయి విక్రయాలతో గత ఐదేళ్లలో రూ.20 కోట్లకుపైగా ఆస్తులు పోగేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ సజ్జనర్ గురువారం కేసు వివరాలు వెల్లడించారు.
ఝార్ఖండ్‌లోని నిమియాఘాట్ మండలంలోని తంబాగుడియో గ్రామానికి చెందిన సత్యం మిశ్రా తన అన్న శుభమ్ మిశ్రా, బంధువులు సచిన్ మిశ్రా, రాహుల్ ఝా, సంతోష్ పండిట్లతో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. నిమియాఘాట్ ప్రాంతంలో దట్టమైన అడవుల్లో గంజాయి సాగు చేయించి.. కోరిన వారికి స్పీడ్ పోస్టు ద్వారా కొరియర్ చేయడం మొదలుపెట్టాడు. స్పీడ్ పోస్టు సమయంలో పోస్టాఫీసు సిబ్బంది తనిఖీ చేయకపోవడాన్ని అవకాశంగా తీసుకున్నారు. గిరిడీలోని ఇస్రీ బజార్, బొకారో జిల్లాలోని ఫుస్రో బజార్ పోస్టాఫీసుల ద్వారా గంజాయి పార్శిళ్లను పంపేవారు. చిన్న డబ్బాలో గంజాయి నింపి అందులో మెడిసిన్ ఉందంటూ పోస్టల్ అధికారులకు చెప్పేవారు. నిందితులు వాట్సప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ తెలంగాణ, ముంబయి, తమిళనాడు, సహా దేశవ్యాప్తంగా దాదాపు 21 రాష్ట్రాల్లోని వినియోగదారులకు గంజాయి డోర్ డెలివరీ చేసేవారు.
ఇస్రీబజార్ నుంచి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, ఫుస్రోబజార్ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌కు ఇటీవల గంజాయి పార్శిళ్లు వచ్చినట్లు హెచ్‌న్యూ విభాగానికి ఉప్పందింది. డెలివరీ తీసుకున్న సుశాంత్ వ్యాస్, లడ్డూలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... ఝార్ఖండ్ నుంచి వచ్చినట్లు బయటపడింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన హెచ్‌న్యూ బృందం.. కొరియర్లు వచ్చిన పోస్టాఫీసుల చిరునామాలకు వెళ్లింది. 20 రోజుల పాటు అక్కడ మాటువేసి సత్యం మిశ్రాను అదుపులోకి తీసుకుంది. అప్పటికే మిగతా నిందితులు పరారయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.