
ఎన్నో అంచనాల నడుమ భారీ బడ్జెట్ చిత్రం నాగబంధం శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చేసింది. సినిమా ఎలా ఉందంటే?
టాలీవుడ్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి అభిషేక్ నామా (Abhishek Nama). డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా గతంలో ‘గూఢచారి’, ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’, ది కాశ్మీర్‌ఫైల్స్ వంటి కొన్ని సంచలనాత్మక చిత్రాలను ప్రేక్షకుల ఎదుటకు తీసుకు వచ్చారు. అలాంటిది మరలా రెండేళ్ల తర్వాత స్వీయ దర్శకత్వంలో ‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ (Virat Karna) హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని పునర్నిర్వచించేలా రూపొందిన ఈ మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ మూవీ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ఏ మేరకు అలరిచిందో ఇక్కడ వీక్షించేయండి.
కథ: 1960లలో ఇద్దరు ఔత్సాహిక అర్కియాలజిస్టులు టెస్లా, అలీ హిమాలయాలలోని ఓ గుహాలో సర్వే చేస్తుండగా కొన్నేండ్లుగా అక్కడే బందీగా ఉన్న బైరాగి అనే తాంత్రికుడు అలీని వశ పరుచుకుంటాడు. ఆపై ప్రపంచాన్ని శాసించే శక్తులు అందించ గల బ్రహ్మ కమలాన్ని ఎలాగైనా కనిపెట్టి తీసుకు రావాలని ఆదేశిస్తాడు. అదే సమయంలో టెస్లా తనకు దొరికిన నాగంబంధంకు సంబంధించిన బుక్‌ను రహస్యంగా తీసుకెళ్లి ఆర్కియాలజీ నిపుణుడు ప్రభాకర్‌కు అప్పజెబుతాడు. మరోవైపు అనాధ అయిన రుద్ర శ్రీరంగపురం సమీపంలో తనను చేరదీసిన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. చెల్లి అంటే పంచ ప్రాణాలు. చెల్లి పెళ్లి నిమిత్తం రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు శ్రీరంగపురం వెళ్లిన రుద్ర అక్కడ తొలి చూపులోనే పార్వతిని ప్రేమిస్తాడు. అయితే సరిగ్గా అదే సమయంలో అక్కడి అలయంలోని బ్రహ్మ కమలం అపహరణకు గురవుతుంది. దానిని అగంతకులు తీసుకెళుతుండగా పెద్ద విష సర్పాలు వెంటపడి అడ్డుకుంటాయి. ఈ క్రమంలో బ్రహ్మ కమలం భైరవకోనలో ఉదృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో చిక్కుకు పోతుంది. ఈ నేపథ్యంలోనే పలువురు వ్యక్తులు రుద్ర వద్దకు వచ్చి చెల్లి పెళ్లి, డబ్బు అశ చూపి భయంకరమైన భైరవ కోనకు తీసుకెళ్లమని కోరడంతో ఓ నాటు పడవలో బయలు దేరుతారు. అక్కడ విపత్కర పరిస్థితులను అధిగమించి బ్రహ్మ కమలంను దక్కించుకునే సమయంలో అది చేజారిపోతుంది. ఇలాంటి పరిస్థితులో తిరిగి ఆ బ్రహ్మ కమలాన్ని కనిపెట్ట గలిగారా లేదా అసలు దానిని ఆలయం నుంచి ఎవరు తస్కరించారు, వారికి దాంతో ఉన్న సంబంధమేంటి, అసలు ఆ బ్రహ్మ కమలం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి, రుద్ర, అలీల కథేంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: మరణాన్ని జయించడం కోసం మనిషి అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందింది ఈ సినిమా. మనం ఇప్పటివరకు చూసిన, తెలిసిన తరహా కథతోనే రూపొందిన ఈ మూవీ నాగబంధం అంటూ టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన నాటి నుంచే హ్యూజ్ బజ్ సొంతం చేసుకుంది. నభా నటేశ్, జగపతి బాబు మినహా హీరోను కలుపుకుని పెద్దగా తెలిసిన నటులు లేక పోయినా భారీ బడ్జెట్, విజువల్స్, రంగనాథ స్వామి బ్యాగ్రౌండ్‌తో మూవీ రిలీజ్ సమయానికి హోరెత్తిన ప్రచార కార్యక్రమాలతో జనాల్లోకి బాగానే వెళ్లింది. అయితే.. సినిమా తొలి భాగం అంతా నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం విగ్రహం, రంగనాథ స్వామి అలయం చుట్టూనే సినిమా నడుస్తుంది. పుస్తకం దొరకడం ఆపై దానికి అనుసంధానమైన బ్రహ్మ కమలం కోసం హీరో రుద్ర సాయంతో విలన్ గ్యాంగ్ వెంటబడడం ఈ క్రమంలో వచ్చే అడ్వెంచర్ యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ట్విస్టులతో బాగానే ఎంగేజ్ చేస్తుంది. అయితే అనసూయ కుటుంబం ఎపిసోడ్ రోటీన్‌గా అనేక సినిమాల మాదిరిగానే తలపించడం మైనస్. ఫ్రీ ఇంటర్వెల్ వరకు స్పీడుగా నడిచిన సినిమా ఆ టైంలో వచ్చే పాట, ఒకటి రెండు సన్నివేశాలు స్పీడు బ్రేకులు వేస్తాయి. ఆపై వచ్చే భారీ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్టు మూవీపై మంచి హై ఇస్తాయి.
ఇక సెకండాఫ్ మొదలయ్యాక హీరో అసలు వాస్తవాలు తెలుసుకున్నాక స్టోరీ లైన్ అంతా మారి మరో కథను చూస్తున్నామా అనే ఫీల్ రావడం పక్కా. అప్పటివరకు మంచి డెప్త్‌తో ట్రెజర్, నాగబంధం, బ్రహ్మ కమలం మిస్టరీ కలగలిపిన దైవత్వం అంటూ సాగిన స్టోరి ఆపై రుద్ర, బైరాగీ, ముస్లిం రాజు చుట్టూనే తిరుగుతూ చూసిన సన్నివేశాలు, పాత్రలు మళ్లీ చూస్తున్నాం అనే భావన కలుగుతుంది. ఫ్రీ క్లైమాక్స్ అంతా భారీ పోరాట సన్నివేశాలతో నింపేసి క్లైమాక్స్ రొటీన్, రిపీట్ సీన్లతో లాగించేశారు. అంతేగాక ప్రతీ సారి చుట్టూ ఉన్న వారంతా చనిపోయాకే హీరో లేచి వచ్చి ఫైట్ చేయడం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది. ఫస్టాప్ అంతా కథ ఒక తరహాలో నడిచి సడన్‌గా హరిహర వీరమల్లు, అఖండ2 మాదిరి హిందూ మతం, సనాతన ధర్మం నరకడాలు, చంపడాలు అంటూ కొత్త టర్న్ తీసుకోవడం కనెక్ట్ అయ్యేలా అనిపించదు. అందుకు సంబంధించిన సన్నివేశాలు సైతం ఎక్కడా బలంగా చూపింది లేదు. పైగా నాగ సాధువులతో కత్తులు పట్టించి, గొంతులవిసేలా అరిపిస్తూ, ముఖంలో వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టించి వారితో హత్యాకాండ నడిపించడం సహజత్వానికి చాలా దూరంగా అనిపిస్తుంది.
సెకండాఫ్‌లో హిందూత్వంపై వచ్చే డైలాగులు మాత్రం బలవంతంగా చెప్పిస్తున్నట్లు ఉంటుంది తప్పితే ఫీల్ అవుతూ చెబుతునట్లు ఉండవు. అంతేగాక సందర్బం ఉన్నా లేకున్నా హీరో, విలన్లు ప్రతీసారి చెవులు పగిలేలా అరిచే సన్నివేశాలు అ మధ్య వచ్చిన కంగువా సినిమాను గుర్తు చేస్తాయి. సినిమా ముగించుకుని వచ్చే సమయంలో స్టైల్ సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్యం పాత్ర పరిస్థితి మనకు వచ్చినట్లు అనిపిస్తుంది. మూవీ తొలి షాట్ నుంచి అకరి వరకు నాగబంధం తెరవాలి అంటూ స్టోరీ నడిపి చివరికి దాని వెనక కథ తెలుసుకోవాలంటే సెకండాఫ్ వరకు ఆగాల్సిందే అంటూ ముగించడం ప్రేక్షకుల్లో అసహనం కలుగజేస్తుంది. అంతేగాక సినిమా అసాంతం హాలీవుడ్ మూవీ జంగీల్ క్రూయిజ్, అంజి, అఖండ 2 వంటి అనేక సినిమాల పోలికలు అనేకం గోచరిస్తాయి. ఇవేగాక కొన్ని సన్నివేశాలలో దర్శకత్వ లోపం, స్కీన్‌ప్లే ఇబ్బందులు స్పష్టంగా అవగతమవుతాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు: ఈ సినిమా విషయంలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది హీరో విరాట్ కర్ణ గురించే. రెండో చిత్రమే అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రుద్రగా, నాగ సాధువుగా అచ్చు గుద్దినట్లు ఆ పాత్రకు సెట్ అయి ఆ పాత్రలో లీనమైపోయాడు. హీరో తర్వాత హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), విలన్ పాత్రదారి రిషభ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్‌లకు మంచి పాత్రలు పడ్డాయి. నభా పాత్ర ప్రేక్షకులకు కాస్త థ్రిల్ ఇస్తుంది. ఇక ఫస్టాప్‌లో వచ్చే పాటలో నభా తొలిసారి అందాలన్నీ ఓలికించేసి కాసేపు థియేటర్లో హీట్ పెంచేసింది. ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్లు ఒకటి రెండు సన్నివేశాలకే పరిమిత మయ్యారు. ఆపై సౌందర్ రాజన్ డీవోపీ, జునైద్, అభి జోడీల మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా అనడంలో అతిశయోక్తి లేదు. విజువల్స్ చాలా సందర్భాల్లో మంచి హైప్ ఇచ్చినా కొన్ని సన్నివేశాల్లో తేలిపోయాయి. చాలా సీన్లలో ఏఐని భారీగానే ఉపయోగించిన సంగతి అర్థం అవుతుంది. ఫస్టాప్‌లో వచ్చే డైలాగ్స్ సైతం ఆకట్టుకుంటాయి. అయితే నిడివి ఈ సినిమాకు ప్రధాన అడ్డంకి. మూడు గంటల 16 నిమిషాలకు పైగా ఉండి ఇబ్బంది పెడుతుంది. సెకండాఫ్ భరించగలం అనుకునే వారు వారు సినిమాను చూసేయవచ్చు