
బంగారం అంటే ఇష్టం ఉండనిది ఎవరికి? అంత విలువైన లోహాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలి? దాని నాణ్యత తగ్గకూడదంటే... ఆ తళుకులు మసకబారకూడదంటే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు...
ఈనాడు, నెల్లూరు
సాధారణంగా స్వచ్ఛమైన బంగారం(24 క్యారెట్) బ్లీచింగ్ పౌడర్‌తో కలిసినా ప్రతిచర్య జరగదు. కానీ 22కే, 18కే వంటి ఆభరణాల్లో బంగారంతో పాటు రాగి, వెండి వంటి లోహాలు ఉంటాయి. బ్లీచింగ్ పౌడర్‌లోని క్లోరిన్ వీటితో ప్రతిచర్య చేసి ఆభరణం రంగు మసకబారడం, మెరుపు తగ్గడం, మచ్చలు పడడం, లోహం బలహీనపడే అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున తగిలితే.. వెంటనే శుభ్రమైన నీటితో కడగాలి. మృదువైన గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరబెట్టాలి. రంగుమారినా, మెరుపు తగ్గినా నమ్మకమైన బంగారు దుకాణంలో పాలిష్ చేయించాలి. అందుకే బాత్రూమ్ శుభ్రం చేసేటప్పుడు, బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ ఉన్న క్లీనర్లు వాడేటప్పుడు బంగారు ఆభరణాలు తీసేయడం మంచిది.
పెర్ఫ్యూమ్స్, డియోడరెంట్, హెయిర్స్ప్రేల వల్ల ఆభరణంపై పొర ఏర్పడి కాంతి తగ్గుతుంది. కాస్మొటిక్స్ వల్ల మురికి పేరుకుపోయి మెరుపు తగ్గుతుంది. శానిటైజర్లు తరచూ తగిలితే మెరుపు తగ్గే అవకాశం ఉంది. చెమట ఎక్కువసేపు ఉంటే మురికి పేరుకుపోయి కాంతి తగ్గుతుంది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా మృదువైన లిక్విడ్ సోప్ కలపండి. ఆభరణాన్ని 10 నుంచి 15 నిమిషాలు అందులో ఉంచండి. చాలా మెత్తని బ్రష్‌తో మెల్లగా శుభ్రం చేయండి. శుభ్రమైన నీటితో కడిగి మెత్తని వస్త్రంపై పూర్తిగా ఆరబెట్టండి. ముత్యాలు, పచ్చలు, పగడాలు వంటి సున్నితమైన రాళ్లు ఉన్న ఆభరణాలను ఎక్కువసేపు నీటిలో నానబెట్టడం మంచిదికాదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.