ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదిరింది. తుది ఒప్పందం ఖరారు దిశగా ప్రయత్నాలు (Ceasefire talks) కొనసాగుతున్నాయి.
మరోవైపు.. ఏప్రిల్‌లో మొదలైన కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీసే విధంగా.. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధులే లక్ష్యంగా ఇజ్రాయెల్ హత్యాయత్నాలకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందినట్లు సమాచారం. ఈ దాడుల గురించి ఇరాన్‌ను అప్రమత్తం చేయాలని గల్ఫ్ దేశాలను అగ్రరాజ్యం కోరిందట. యూఎస్ మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ లక్ష్యంగా ఈ దాడులు ఉండే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
ఇరాన్లో పాలనాయంత్రాంగాన్ని కూలదోసే లక్ష్యంతో అమెరికా-ఇజ్రాయెల్ (USA-Israel) ఫిబ్రవరి 28న దాడులు మొదలుపెట్టాయి. ఘర్షణలు తీవ్రదశలో ఉన్నప్పుడు ఘాలిబఫ్, అరాగ్చీను టార్గెట్ చేయాలని ఇజ్రాయెల్ యోచించినట్లు తెలుస్తోంది. దాంతో ఏప్రిల్‌లో మొదలైన చర్చలను ఆ దాడులు దెబ్బతీసి, మళ్లీ ఉద్రిక్తతలను పెంచుతాయని అమెరికా భావించింది. దాడులు ప్రారంభమైనప్పుడు ఇరాన్ నౌకాదళం, క్షిపణ వ్యవస్థలను ట్రంప్ సైన్యం లక్ష్యంగా చేసుకోగా.. కీలక నేతలను ఇజ్రాయెల్ (Israel) హతమార్చింది. తొలి రోజు దాడుల్లో నాటి సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఇరాన్ (Iran) ఉన్నతస్థాయి నేతలు అలీ లారిజానీ, కమాల్ ఖరాజీ మృతి చెందారు. వీరిద్దరితోనే అమెరికా చర్చలు జరపాలని భావించింది.
ఆ తర్వాత చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న అరాగ్చీ, ఘాలిబఫ్లను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందని అమెరికా అనుమానించింది. వీరిద్దరూ ఇజ్రాయెల్ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమైన తర్వాత యూఎస్ (USA) ఒత్తిడితో వారిని జాబితా నుంచి పక్కనపెట్టిందని సమాచారం. ఇక ఘాలిబఫ్ రెండుసార్లు మరణం అంచులవరకూ వెళ్లారు. 2025 జూన్‌లో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో, ఈ ఫిబ్రవరిలో ఘర్షణలు మొదలైనప్పుడు చావు నుంచి తృటిలో తప్పించుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌తో చర్చల అనంతరం టెహ్రాన్‌కు బయల్దేరినప్పుడు ఆయన హత్యకు ప్లాన్ జరిగింది. దాంతో పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇరాన్ ఎయిర్పోర్ట్ మషదలో ఆయన విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. అక్కడి నుంచి టెహ్రాన్‌కు రోడ్డు మార్గంలో చేరుకున్నారని ఆ కథనాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ టార్గెట్ చేయొచ్చనే ఆందోళనలు ఉన్నప్పటికీ.. అరాగ్చీ, ఘాలిబఫ్ చర్చల కోసం ఖతార్, స్విట్జర్లాండ్‌లో పర్యటించడం గమనార్హం. యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఏకాభిప్రాయంతోనే ప్రారంభించినా.. తర్వాత వివిధ అంశాల్లో వారి మధ్య దూరం పెరిగింది. ట్రంప్ ప్రభుత్వం శాంతి కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్‌లో తొలుత రెండువారాల పాటు కాల్పలు విరమణ జరిగింది. దానికి ఇజ్రాయెల్ అయిష్టంగానే ఓకే చెప్పింది. అంతేగాకుండా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తొందరపడుతోందనే ఆందోళనా ఇజ్రాయెల్‌లో వ్యక్తమైందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికీ ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటే.. ఇజ్రాయెల్ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణ శిక్షకు అర్హుడని పేర్కొనడం, అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసేందుకు టెహ్రాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆ దేశ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలను రాజేసింది. అమెరికా తన పెంపుడు శక్తులను అదుపులో ఉంచుకోవాలంటూ ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.