
దిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్ఛుక్ చేపట్టిన నిరాహార దీక్ష గురువారం ఐదో రోజుకు చేరింది.
నీట్-యూజీ (2026) పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ కావడానికి బాధ్యత వహించి మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన ప్రదర్శనకు మద్దతుగా వాంగ్ఛుక్ నిరాహార దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా దీక్షలో ఉన్న వాంగ్ఛుక్ రక్తంలో చక్కెర స్థాయి 60కి పడిపోయిందని, ఆయన రక్తపోటు క్షీణించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలియజేశారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన బైఠాయింపు గురువారం 13వ రోజుకు చేరుకుంది. ప్రదర్శన ప్రదేశంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై ఏసీపీ శర్మ దాడి చేసి పుస్తకాలను చిందరవందర చేశారని నిరసనకారులు చెప్పారు. శివాజీ మహరాజ్, భగత్సింగ్లకు సంబంధించిన పుస్తకాలను విసిరేసి ఆ ఇరువురు చరిత్ర పురుషులనూ అవమానించిన ఏసీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్టీఐ కార్యకర్త నిఖిల్ డేలు యువతరం నిరసనలకు మద్దతు తెలిపారు. సోనం సర్ ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోంది. ఆయనకు ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వానిదే బాధ్యత, అని దీప్కే తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.